West Bengal: పశ్చిమబెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల పై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే కారుపై కొంతమంది వ్యక్తులు, కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం కలకలం సృష్టించింది. హుగ్లీ జిల్లా శీరాంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్‌ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ ఈ రోజు శ్రీరాంపూర్‌లో మమతా బహిరంగ సభకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాగా మొదట ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టిన ఒక గుంపు ‘కుణాల్ ఘోష్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనాన్ని ముందుకు కదలకుండా నిలిపివేసిన ఆందోళనకారులు కోడిగుడ్లు, రాళ్లు రువ్వడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దం పూర్తిగా పగిలిపోయింది.ఈ ఆకస్మిక దాడి, భద్రతా లోపం కారణంగా ఘోష్ తన శీరాంపూర్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ‘జంగల్ రాజ్’ నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లాల్ బజార్ లేదా భవానీ భవన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెళ్లడించారు.

కాగా, ఎమ్మెల్యేపై జరిగిన దాడిని మాజీసీఎం, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు సృష్టించవద్దు’ అని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ ఘటనలో కుణాల్ ఘోష్‌కు గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు, దాడి జరిగిన స్థలానికి తాను స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తానని స్పష్టం చేశారు. TMC నాయకులు, కార్యకర్తలను బీజేపీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.