
Sabarimala : కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శబరిమల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం తెరిచిన మొదటి రోజే సుమారు 30 వేల మంది భక్తులు దర్శనం కోసం ముందుగానే పేర్లు నమోదు చేసుకున్నారు. తంత్రి కందరరు బ్రహ్మదత్తన్ సమక్షంలో ఆలయం తెరిచే కార్యక్రమం జరిగింది. గర్భగుడిలో మేళశాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి దీపం వెలిగించారు. అనంతరం కొత్త మేళశాంతుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
శబరిమల ఆలయ కొత్త మేళశాంతిగా అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి బాధ్యతలు చేపట్టారు. పక్కనే ఉన్న మాళికప్పురం ఆలయ మేళశాంతిగా ఏ. దామోదరన్ నంబూద్రి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం నుంచి రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇందులో వర్చువల్ క్యూ ద్వారా 60 వేల మందికి, నీలక్కల్‌లో నేరుగా టోకెన్ల ద్వారా 10 వేల మందికి అవకాశం కల్పించారు.
Also Read : యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ బిగ్ అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు రూల్స్!
ఎరుమేలి, పుల్లుమేడు అటవీ మార్గాల ద్వారా ఒక్కో మార్గంలో 3 వేల మంది చొప్పున, వండిపెరియార్‌లోని సత్రం మార్గం ద్వారా మరో 2 వేల మందికి అనుమతి ఇస్తారు. ఈ మార్గాల్లో వెళ్లాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి. పంబాలో నేరుగా టోకెన్లు ఇచ్చే సదుపాయం ఉండదు. మొదటి రోజు భక్తుల రద్దీని నియంత్రించేందుకు నీలక్కల్ నుంచి పంబాకు మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. తీర్థయాత్ర సీజన్‌లో ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఉదయం 11 గంటల వరకు నెయ్యాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం పూజ తర్వాత ఒంటి గంటకు ఆలయాన్ని మూసివేసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. హరివరాసనం పాట అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.
వచ్చే ఏడాది జనవరి 14న మకరవిళక్కు ఉత్సవం జరగనుంది. జనవరి 20న ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేయడంతో ఈ ఏడాది తీర్థయాత్ర సీజన్ ముగుస్తుంది.గతంలో శబరిమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈసారి అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండ మార్గాల్లో భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, జిల్లా అధికారులు కలిసి ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక వసతి, వైద్య సహాయం, రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ వంటి సదుపాయాలు కల్పించారు. వర్షాల కారణంగా ప్రయాణానికి ఆటంకాలు కలిగే అవకాశం ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు కూడా 41 రోజుల మండల దీక్షకు సిద్ధమవుతున్నారు. భక్తులు తప్పనిసరిగా వర్చువల్ క్యూ ద్వారా టోకెన్లు తీసుకోవాలని, తమకు కేటాయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈసారి దర్శన ఏర్పాట్లు చేశారు.
Also Read : 14 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై.. తమిళనాడు మంత్రి విడాకులు!









