
Hydrogen Train : భారత రైల్వే రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక రైలు, హర్యానాలోని జింద్ , సోనిపట్ మధ్య ప్రయాణించనుంది. 89 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు మార్గం ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు కోసం జింద్‌లో స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ నిల్వ , రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : రంగుల పాపడ్లతో క్యాన్సర్ ముప్పు.. తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం
ఇక ఈ రైలు ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత 10-కోచ్‌ల రైలు. 1200 kW సామర్థ్యం గల ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో ఇది నడుస్తుంది. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగల ఈ రైలు, అనుమతించబడిన వేగం గంటకు 75 కిలోమీటర్లు. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణించవచ్చు. ఈ రైలు జింద్ జంక్షన్, గోహానా జంక్షన్ , సోనిపట్ మధ్య ప్రయాణిస్తూ, జింద్ సిటీ, పండు పిందారా జంక్షన్, లలిత్ ఖేరా, భాంభేవా, ఇసాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, రాబ్రా, లాత్, మోహనా, బర్వాస్ని వంటి పలు స్టేషన్లలో ఆగుతుంది.
డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి ఎటువంటి హాని చేయని కాలుష్య రహిత సాంకేతికతతో ఈ రైలు పనిచేస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత. పర్యావరణ అనుకూల రైలు ప్రయాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ఒక మార్గదర్శిగా నిలవనుంది.
హైడ్రోజన్ రైళ్లను ఉపయోగిస్తున్న పరిమిత దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఇప్పటికే జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. 2022లో జర్మనీ ప్రపంచంలోనే మొదటి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రారంభించగా, అమెరికాలోని కాలిఫోర్నియాలో 2024లో జెము పేరుతో హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టారు. జపాన్ కూడా 2027 నాటికి తన మొదటి హైడ్రోజన్ హైబ్రిడ్ రైలును సిద్ధం చేస్తోంది.
Also Read : నీట్-యూజీ రీటెస్ట్ ఫలితాలు రిలీజ్.. టాపర్లు వీళ్లే!









