
Bihar: బీహార్లోని ఖగారియా జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను దొంగిలించడానికి ప్రయత్నించిన వ్యక్తి, ప్రయాణికుల చేతికి చిక్కి అడ్డంగా దొరికిపోయాడు. ఆ దొంగను ప్రయాణికులు వదలకపోవడంతో, కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూనే సుమారు 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈటీవీ భారత్ కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి మాన్సీ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన జనహిత్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. రైలు కిటికీ గుండా లోపలికి చెయ్యి పెట్టి మొబైల్ లాక్కోవాలని ప్రయత్నించగా, ప్రయాణికులు వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగం పుంజుకున్నా సరే, ప్రయాణికులు అతనిని వదలలేదు. ఖగారియా స్టేషన్కు చేరుకునే వరకు ఆ వ్యక్తి కిటికీకి వేలాడుతూనే ఉన్నాడు. స్టేషన్ రాగానే అతన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)కి అప్పగించారు.
Passengers on a moving train in Khagaria, Bihar caught a mobile phone thief red-handed!
In a desperate bid to escape, the thief hung out of the window, begging for forgiveness while angry passengers held him tightly and questioned him.
Viral video capturing the dramatic scene… pic.twitter.com/FrD65Biz8C
— Siraj Noorani (@sirajnoorani) July 11, 2026
వైరల్ అయిన వీడియోలో, ఆ వ్యక్తి భయపడుతూ తానూ దొంగతనం చేయలేదని వాదించడం కనిపిస్తుంది. ప్రయాణికులు ఎందుకు పట్టుకున్నారని అడిగితే, “మొబైల్ చోరీ చేస్తున్నాడు” అని వారు సమాధానమిచ్చారు. రైలు బయట నుండి లోపలికి ఎందుకు చెయ్యి వేశావని అడిగితే, ఆ వ్యక్తి సమాధానం చెప్పలేక తడబడ్డాడు. అంతేకాకుండా, ఆ వ్యక్తి మొదట తన పేరు ఛోటు యాదవ్ అని, ఆ తర్వాత పంకజ్ యాదవ్ అని తప్పుడు పేర్లు చెప్పాడు. పోలీసులు విచారణలో అతను చెప్పిన వివరాలన్నీ అబద్ధమని తేలింది.
ప్రయాణికులను ప్రమాదం నుండి కాపాడటానికి, అలాగే దొంగతనాన్ని అడ్డుకోవడానికి ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకుని గట్టిగా ఉంచారు. ఒకవేళ అతన్ని వదిలేస్తే రైలు నుండి కింద పడి చనిపోయే ప్రమాదం ఉందని, ఆ విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ ప్రయాణికుల అప్రమత్తతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మాన్సీ రైల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సౌరవ్ కుమార్ మాట్లాడుతూ, మొదట ఎవరో రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారని భావించామని, కానీ విషయం తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఒక మొబైల్ దొంగ అని అర్థమైందని చెప్పారు. ఖగారియా స్టేషన్లో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, అతడి అసలు పేరు బర్కత్ మన్సూరి అని, అతను నౌగాచియా నివాసి అని గుర్తించారు. అతడిపై గతంలో కూడా ఇలాంటి దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం BNS సెక్షన్లు 317(5) .304(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









