Pawan Kalyan :  ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా ఆధ్వర్యంలో సుమారు మూడున్నర గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేయగా, మరికొన్ని రోజుల తర్వాత ఆయన ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

నిజానికి పవన్ కళ్యాణ్ భుజానికి 2016లోనే గాయమైంది. అప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా ఆయన తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఎంత నొప్పి ఉన్నా, బాధ్యతలు మరియు సినిమా షూటింగ్‌ల నేపథ్యంలో దీనిని భరిస్తూనే వచ్చారు. తాజాగా నొప్పి తీవ్రత పెరగడంతో ఆయన సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ముంబై వెళ్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆయన ముంబై చేరుకుని, ఆసుపత్రిలో ఉన్న పవన్‌ను కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో నిమగ్నమవుతారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.