మహారాష్ట్ర రాజధాని ముంబైని నైరుతి రుతుపవనాలు పలకరించిన వేళ, తొలిరోజు కురిసిన భారీ వర్షాల ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ముంబై మేయర్ రీతూ తావ్డే కళ్లెదుటే ఓ వ్యక్తి తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోవడం సంచలనంగా మారింది. ఈ ఊహించని ప్రమాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మేయర్.. అక్కడికక్కడే బాధ్యుడైన అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరంలో ఎక్కడైనా మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే, దానికి సంబంధించిన వార్డు అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.
Also Read : మమతకు రెబల్స్ భారీ షాక్.. అధ్యక్ష పదవి నుంచి తొలగింపు!
Mumbai Rains
సాధారణ సమయం కంటే దాదాపు రెండు వారాలు ఆలస్యంగా మంగళవారం ముంబైని తాకిన రుతుపవనాలు.. రాత్రంతా నగరవ్యాప్తంగా కుండపోత వర్షాన్ని కురిపించాయి. ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు జలమయమై, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే మేయర్ రీతూ తావ్డే వరద ముంపునకు గురయ్యే దాదర్, హింద్‌మాతా, గాంధీ మార్కెట్ వంటి కీలక ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలోనే బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC)కి చెందిన ఒక పారిశుధ్య కార్మికుడు తెరిచి ఉన్న డ్రైనేజీ గుంతలో పడిపోయాడు.
ఈ ప్రమాదంపై మేయర్ రీతూ తావ్డే స్పందిస్తూ.. మ్యాన్‌హోల్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకే దాని మూతను పక్కకు జరిపారని వెల్లడించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడ ఏర్పాటు చేసిన ‘అలర్ట్’ సైన్ బోర్డును, బారికేడ్లను గమనించి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, బీఎంసీ ఏర్పాటు చేసే నోటీసులు, పోస్టర్లను ముంబై ప్రజలు తప్పనిసరిగా గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు భారీ పంపులను రంగంలోకి దించామని, బీఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని తెలిపారు.
మరోవైపు ఈ వర్షాల ఉదంతం ముంబైలో రాజకీయ దుమారానికి దారితీసింది. పాలక పక్షమైన మహాయుతి కూటమిపై శివసేన (UBT) నాయకుడు ఆధిత్య థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గత తమ ప్రభుత్వం సూచించిన విధంగా వర్షపు నీటి నిల్వ ట్యాంకులను నిర్మించకుండా, పాలకపక్షం బీఎంసీ నిధులను వృథా చేసిందని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.
ముంబై లాంటి తీర ప్రాంత నగరానికి పంపింగ్ స్టేషన్లు, భారీ వర్షపు నీటి కాలువలు ఎంతో అవసరమని ఆధిత్య థాకరే గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 2020-2022 మధ్య హింద్‌మాతా, గాంధీ మార్కెట్, మిలాన్ సబ్‌వేలలో ఇలాంటి వ్యవస్థలను నిర్మించి వరదలను అరికట్టామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పాలకులు ఆ పంపులను, ట్యాంకులను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ముంబై మళ్లీ మునిగిపోతోందని మండిపడ్డారు. ఈ విమర్శలపై మేయర్ రీతూ తావ్డే ఘాటుగా స్పందిస్తూ.. “ఇంట్లో కూర్చుంటే పనులు కావు, క్షేత్రస్థాయిలోకి రావాలి” అంటూ గత కోవిడ్ సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరును ఎద్దేవా చేశారు.
ఇదిలావుండగా, మంగళవారం రాత్రి 8:30 గంటల నుండి బుధవారం ఉదయం 8:30 గంటల మధ్య ముంబైలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. కొలాబాలో అత్యధికంగా 247.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, రామ్ మందిర్ ప్రాంతంలో 238 మి.మీ, శాంతాక్రూజ్‌లో 224.8 మి.మీ వర్షం కురిసింది. అలాగే సియన్, విఖ్రోలి, విద్యావిహార్, చెంబూర్, బైకుల్లా, బాంద్రా వంటి ప్రాంతాలలో కూడా 115.6 మి.మీ నుండి 204.4 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి.
ఈ భారీ వర్షాల ధాటికి నగరంలో పలు ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. విఖ్రోలి వెస్ట్‌లోని జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్డులో ఉన్న సన్ సిటీ కాంప్లెక్స్ సమీపంలో ఒక నివాస భవనానికి ఆనుకుని ఉన్న భారీ రక్షణ గోడ కుప్పకూలింది. అలాగే మరో ప్రాంతంలో ఒక భారీ వృక్షం కారుపై విరిగిపడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు లోపల కూర్చుని ఉన్న డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతడిని రక్షించేందుకు, చెట్టును తొలగించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.