
ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్న యువత నేడు గాంధీ జయంతి(Gandhi Jayanthi) ని పురస్కరించుకుని ముంబైలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అనే జెన్-జెడ్ ఈ ‘జైల్ భరో ఆందోళన్’కు శ్రీకారం చుట్టింది. ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు సీజేపీ అనుమతి కోరగా.. ట్రాఫిక్ ఇబ్బందులు, పౌర నిబంధనలు, పాత హైకోర్టు ఉత్తర్వులను బూచిగా చూపి ముంబై పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. అయితే పోలీసులు నో చెప్పినంత మాత్రాన తగ్గేదేలే అంటోంది సీజేపీ. పోలీసుల నిరాకరణ తర్వాత, ఈ సవాలును స్వీకరిస్తూ గాంధీ జయంతి రోజునే ప్రత్యక్షంగా రోడ్డుపైకి వచ్చి అరెస్టయ్యేందుకు జైల్ భరో కార్యక్రమాన్ని ఖరారు చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
సాధారణంగా మీమ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్, క్రియేటివ్ నినాదాలతో రచ్చ చేసే ఈ జెన్-జెడ్ బృందం, ఈసారి ఏకంగా మహాత్మా గాంధీ మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ప్రచార పోస్టర్లలో బాపూజీ చిత్రాలను ఉపయోగిస్తూ.. శాసనోల్లంఘన, అహింసాత్మక ప్రతిఘటన ద్వారా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. అప్పట్లో గాంధీజీ అహింసా మార్గంలో సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల ద్వారా బ్రిటీష్ పాలనను ఎలా కుదిపేశారో అదే అహింసాత్మక పద్ధతిలో తమ నిరసన తెలపడమే ఈ ‘జైల్ భరో’ ముఖ్య ఉద్దేశమని వారు చెప్తున్నారు. ముంబైలో ఈ నిరసన తర్వాత గోవా, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు కూడా ఈ ఆందోళనలను విస్తరింపజేయాలని సీజేపీ ప్లాన్ చేస్తోంది.
Also Read : రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. ఈ డిటైల్స్ కంప్లీట్ చేయకపోతే డబ్బులు రానట్లే?
ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీవ్రమైన పొరపాట్లు చేశారని సీజేపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్ల హక్కులు దెబ్బతిన్నాయని వారు మండిపడుతున్నారు. గత 10 నెలల కాలంలో ఓటర్ల జాబితా డేటాబేస్, ఈసీఐనెట్ వ్యవస్థ, ఫారం-6 మార్పులు, ఓటర్ల తొలగింపులపై ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు కనీసం 14 సార్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. గోవాలో కేవలం సాఫ్ట్వేర్ లోపాల కారణంగానే 97 మంది అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తుడిచిపెట్టుకుపోయారని కూడా బయటపడింది.
అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పూర్తిగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన బహుళ-సభ్యుల కమిషన్లో విభిన్నమైన అభిప్రాయాలు, అంతర్గత అభ్యంతరాలు ఉండటం సహజమని, తమ నిర్ణయాలన్నీ చట్టానికి లోబడే ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేసింది. కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా సీఈసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని, వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా సమీక్షించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read : ప్రాణాలు పోతున్నా వెనక్కి తగ్గలేదు.. నీర్జా, స్మిత్ మచ్చర్ ఇద్దరూ హీరోలే!









