
ఇన్ని రోజులు వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు వర్షాకాలం రాకతో ఉపశమనం లభించింది. అయితే వేసవిలో ఎలా అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించారో అంతకు మించిన జాగ్రత్తలు ఈ సీజన్‌లోనూ పాటించక తప్పదు. ఈ వర్షాకాలం సీజన్‌లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులతో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో చేయకూడని పనులు
ఇంట్లో బట్టలు ఆరవేయకూడదు: చాలా మంది ఈ సీజన్‌లో తడిబట్టలను ఇంట్లో ఆరవేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో తేమ పెరుగుతుంది. దీంతో బట్టలపై బూజు పట్టి శ్వాసకోస సమస్యలకు దారితీస్తుంది.
నిల్వ ఉంచిన ఆహారం: వర్షాకాలంలో బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో స్టోర్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో ఉంచిన ఆహారాలను తినడం మానుకోవాలి.
రోడ్ సైడ్ ఫుడ్స్‌కు దూరం: ఈ సీజన్‌లో ఈగలు, దోమలు విపరీతంగా పెరుగుతాయి. అవి రోడ్ సైడ్ ఫుడ్స్ పై వాలడంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎలక్ట్రానిక్స్ వస్తువులకు దూరం: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులకు చాలా దూరంగా ఉండాలి. తడి చేతులతో స్విచ్‌లు వేయడం, ప్లగ్‌లు పెట్టడం చేయకూడదు. అలాగే గోడలు తేమగా ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కరెంట్ వస్తువులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
పాటించాల్సిన జాగ్రత్తలు
వేడి నీళ్లు తాగడం: ఈ సీజన్‌లో నీరు త్వరగా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల జ్వరం, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధుల బారిన పడొచ్చు. అందువల్ల వర్షాకాలంలో వేడిచేసిన నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం.
నీటి నిల్వలు: చాలా మంది తమ ఇంటి పరిసరాల్లో పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో వాటర్‌ను అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మురికి నీటిలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందే దోమలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ఆ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల నీటి నిల్వలను వెంటనే క్లీన్ చేయాలి.
వేడి వేడి ఆహారం తినాలి: వర్షాకాలంలో వేడివేడి ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. మిగిలిపోయిన ఫుడ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి తినడం తగ్గించాలి. అలాగే ఫుడ్స్‌పై మూతలు ఉండేలా చూసుకోవాలి.
ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి: ఇకపై ఇమ్యూనిటీని పెంచే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు వంటివి ఎక్కువగా చేర్చుకోవడం వల్ల యాంటీబయాటిక్స్‌గా పనిచేసి బాడీకి ఇమ్యూనిటీని అందిస్తాయి.
దోమతేరలు వాడటం: వర్షాకాలంలో దోమలు, ఈగలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో దోమతెరలు వాడటం ఎంతో ముఖ్యం. అందులోనూ చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే.









