ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, పెద్ద రెస్టారెంట్లు, ఖరీదైన కాఫీలు, విలాసవంతమైన జీవితం చూపిస్తూ.. తాను పెద్ద బిజినెస్‌మెన్‌లా నమ్మించిన ఓ 23 ఏళ్ల యువకుడు దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, రకరకాల కారణాలు చెప్పి వారి దగ్గర నుంచి దాదాపు రూ.24 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విక్రాంత్ తోమర్ అనే ఈ యువకుడు ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుళ్లను టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగా వారితో పరిచయం పెంచుకునేవాడు. తన దగ్గర చాలా డబ్బు ఉందని నమ్మించేందుకు ఖరీదైన కార్లు, మంచి హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవాడు.

ఆ తర్వాత మహిళా కానిస్టేబుళ్లతో స్నేహం పెంచుకుని.. వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు. వారు తనను నమ్మిన తర్వాత వివిధ కారణాలు చెప్పి డబ్బులు అడిగేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో బయటకు వచ్చింది. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ మహిళా కానిస్టేబుల్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి విక్రాంత్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో విక్రాంత్ ఒక్కరినే కాకుండా మరికొందరు మహిళా కానిస్టేబుళ్లను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు గుర్తించారు. విక్రాంత్ మహిళా కానిస్టేబుళ్లను ఆకట్టుకునేందుకు ఖరీదైన కార్లను అద్దెకు తీసుకునేవాడని పోలీసులు చెప్పారు. ఒక్కోసారి ఎనిమిది గంటల పాటు లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని వారితో బయటకు వెళ్లేవాడని తెలిపారు.

విక్రాంత్ చేతిలో దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లు మోసపోయి ఉండొచ్చని పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే బ్యాచ్‌కు చెందినవారని చెబుతున్నారు. అయితే, మోసపోయినట్లు భావిస్తున్న కొందరు మహిళా కానిస్టేబుళ్లు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విక్రాంత్‌తో కలిసి ఓ మహిళా కానిస్టేబుల్ ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆమె ఢిల్లీ పోలీస్‌లోనే పనిచేస్తున్నారు. ఆమెతో పనిచేసే ఇతర మహిళా కానిస్టేబుళ్ల గురించి విక్రాంత్‌కు సమాచారం అందించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమాచారంతోనే అతడు మహిళా కానిస్టేబుళ్లను గుర్తించి, వారితో పరిచయం పెంచుకుని ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మహిళల నుంచి తీసుకున్న డబ్బుల విషయంలో ‘OneX’ అనే బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ఖాతాలను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు ఏ ఖాతాల్లోకి వెళ్లాయి, వాటిని ఎలా ఉపయోగించారు అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also Read : డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు: కొత్త కలర్ కోడింగ్, సేఫ్ డ్రైవింగ్ టెస్ట్!

ఇప్పటికే ఐదు కేసులు

విక్రాంత్‌పై ఢిల్లీలో ఇప్పటికే ఐదు మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాయాపురి, హరి నగర్, ఇందర్‌పురి, ఈస్ట్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్‌లలో అతడిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో విక్రాంత్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విక్రాంత్‌ను బురారీలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంతమంది మహిళలను మోసం చేశాడు, ఎంత డబ్బు తీసుకున్నాడు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది అనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

Also Read : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాల ఎగుమతిలో టాప్-2కి చేరిన భారత్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.