Cockroach Janta Party
Cockroach Janta Party

Cockroach Janta Party :  నీట్, సీబీఎస్‌ఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు మార్గం సుగమమైంది. జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనను అడ్డుకోవాలని, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్‌ ఇండియా ఫౌండేషన్‌’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జస్టిస్‌ సౌరభ్‌ బెనర్జీ, జస్టిస్‌ అమిత్‌ శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్ ఈ వ్యవహారంలో అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

https://x.com/jeelanikash/status/2063115994248380772

కోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్‌ media వేదికగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ, విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్‌లైన్‌లో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల ఢిల్లీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఈ నిరసనకు అనుమతి నిరాకరించడమో లేదా వేరే ప్రాంతానికి మార్చడమో చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

https://x.com/the_hindu/status/2063114623495356879

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నాకు చివరకు అనుమతి మంజూరు చేశారు. అయితే, నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారకుండా చూసేందుకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులు పరిమితులు దాటకుండా ఉండేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసి కఠినమైన నిఘా ఉంచారు. పరీక్షల లీకేజీల అంశంపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతటా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు.

https://x.com/Cockroachisback/status/2063106579126272250

మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో చొచ్చుకుపోయిన సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అమెరికా నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే నిరసనకు భారీ సంఖ్యలో తరలి రావాల్సిందిగా ఆయన ఇప్పటికే దేశంలోని యువతకు, నిరుద్యోగులకు సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కోరడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కూడా సందడి నెలకొంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పోలీసుల అనుమతి లభించడంతో సీజేపీ శ్రేణులు ఉత్సాహంగా జంతర్ మంతర్ వైపు కదులుతుండటంతో రాజధానిలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.