
Karnataka : కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళ బతికే ఉన్నట్లు తేలింది. ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తి రెండేళ్లకు పైగా జైల్లో గడిపాడు. 2019 జులై 3న మంజు అనే మహిళ తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు ఇష్టం లేకుండానే పెళ్లి చేయడంతో, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లింది. వెళ్లే ముందు బస్టాండ్‌లో రాజేష్ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేసింది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
మంజు తండ్రి నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. రాజేష్ ఫోన్ నుంచి ఆమె చివరిసారిగా కాల్ చేయడంతో అతడిపై అనుమానం వచ్చింది. 2021లో రాజేష్ తన కుమార్తెను హత్య చేసి మృతదేహాన్ని కావేరి నదిలో పడేశాడని నాగరాజు మరోసారి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాజేష్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మృతదేహం లభించకపోయినా చార్జిషీట్ దాఖలు చేశారు.
రాజేష్ రెండేళ్ల నుంచి రెండున్నరేళ్ల వరకు జైల్లో ఉండి, తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు ప్రయత్నించిన అతని న్యాయవాదులు చివరకు మండ్యలోని నాగమంగళ ప్రాంతంలో మంజును గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి జీవిస్తున్నట్లు తెలుసుకున్నారు.
పోలీసుల విచారణలో మంజు కీలక విషయాలు వెల్లడించింది. రాజేష్ ఎవరో కూడా తనకు తెలియదని, అతను పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేసింది. తన అదృశ్యం తర్వాత హత్య కేసు నమోదైన విషయం కూడా తనకు తెలియదని తెలిపింది.
ఈ ఘటనపై మండ్య ఎస్పీ శోభారాణి స్పందిస్తూ, కేసు విచారణలో జరిగిన పొరపాట్లపై సమగ్ర విచారణకు డీఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు తప్పుడు ఫిర్యాదు చేసిన మంజు తండ్రిపై, అప్పటి విచారణాధికారి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని రాజేష్ కుటుంబం డిమాండ్ చేస్తోంది.









