IRCTC : పండుగల సీజన్‌ మొదలవడంతో రైలు టికెట్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా మంది ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో ఒకేసారి లక్షల మంది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7న ఒక్కరోజులో 20,06,353 రైలు టికెట్లు బుక్‌ అయ్యాయి.

ఇప్పటివరకు ఒక్కరోజులో జరిగిన అత్యధిక టికెట్‌ బుకింగ్‌ ఇదే. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్‌ 8న కూడా 19,50,699 టికెట్లు బుక్‌ అయ్యాయి. ప్రస్తుతం రిజర్వేషన్‌ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్‌ అవుతున్నాయి. దీంతో ఐఆర్‌సీటీసీ తన ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.

Also Read : పుతిన్‌కు మోదీ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైన వెంటనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ మొదలైన తర్వాత మొదటి 15 నిమిషాల్లోనే చాలా మంది ఒకేసారి టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఐఆర్‌సీటీసీ ప్రకారం.. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యే రోజులో జరిగే మొత్తం బుకింగ్‌లలో 8.43 శాతం నుంచి 14.14 శాతం వరకు జరుగుతున్నాయి. అయితే 85 శాతానికి పైగా బుకింగ్‌లు ఉదయం 9 గంటల తర్వాత జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఉదయం 8 నుంచి 8.15 గంటల మధ్యే అత్యధిక రద్దీ ఉంటోంది. ఈ సమయంలో ఒకేసారి చాలా మంది టికెట్లు బుక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టికెట్లు బుక్‌ చేసే సమయంలో అందరికీ సమాన అవకాశం ఉండేలా ఐఆర్‌సీటీసీ కొన్ని నిబంధనలు పెట్టింది. ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమయ్యే సమయంలో టికెట్‌ బుక్‌ చేయాలంటే ఆధార్‌తో వెరిఫై చేసిన యూజర్లు మాత్రమే బుక్‌ చేయగలరు. ఈ నిబంధన 2025 అక్టోబర్‌ 12 నుంచి అమల్లో ఉంది.

అలాగే టికెట్‌ ఏజెంట్లకు కూడా మొదటి 10 నిమిషాల్లో టికెట్లు బుక్‌ చేసే అవకాశం ఉండదు. ఉదయం 8 గంటల నుంచి 8.10 గంటల వరకు యాత్రి టికెట్‌ సువిధ కేంద్రాలు, రైల్వే టికెటింగ్‌ ఏజెంట్లు, ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు ముందస్తు రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ చేయలేరు.

Also Read : తీవ్ర అప్పుల్లో భారతీయ కుటుంబాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.