
Cab Aggregators : క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ ఇవ్వాలని ప్రయాణికులను అడగడం ఇకపై కుదరదు. ముందుగానే టిప్ చెల్లించే ఆప్షన్‌ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు అన్యాయమైన వ్యాపార విధానంగా ఉందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ నిధి ఖరే తెలిపారు.
క్యాబ్ బుకింగ్‌కు ముందే టిప్ చెల్లించే విధానం ఉందంటూ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు చాలా ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె చెప్పారు. టిప్ ఇవ్వకపోతే క్యాబ్ దొరకదనేలా ప్రయాణికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విధానం సరిగ్గా లేదని గుర్తించిన తర్వాత సీసీపీఏ దీనిపై విచారణ చేపట్టిందని నిధి ఖరే చెప్పారు.
విచారణ, సంబంధిత సంస్థల వాదనలు విన్న తర్వాత.. బుకింగ్‌కు ముందే టిప్ చెల్లించేలా ఉండే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. టిప్ అనేది పూర్తిగా ప్రయాణికుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని నిధి ఖరే స్పష్టం చేశారు. ప్రయాణం పూర్తయిన తర్వాత సేవ నచ్చితే డ్రైవర్‌కు టిప్ ఇవ్వాలా వద్దా అనేది ప్రయాణికుడే నిర్ణయించుకోవాలని చెప్పారు.
క్యాబ్ బుకింగ్ విధానాల్లో అన్యాయమైన పద్ధతులపై సీసీపీఏ చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాపిడో సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. డ్రైవర్లకు ముందుగానే ఎక్కువ డబ్బు ఇవ్వాలని ప్రయాణికులను ప్రోత్సహించడం, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార విధానాలు వంటి అంశాలపై ఈ చర్య తీసుకున్నారు. రాపిడో యాప్‌లో క్యాబ్ బుకింగ్ జరుగుతున్న సమయంలోనే ఎక్కువ డబ్బు చెల్లిస్తే రైడ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని చూపించినట్లు సీసీపీఏ గుర్తించింది.
మొదట ఒక ధరను చూపించి బుకింగ్ చేసిన తర్వాత.. డ్రైవర్లు ఆ ధరకు రైడ్ అంగీకరించడం లేదని చెబుతూ అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించాలనే సూచనలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికుడికి త్వరగా క్యాబ్ కావాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే అన్న భావన కలిగే అవకాశం ఉందని సీసీపీఏ పేర్కొంది. ఇప్పటికే ప్రయాణికుడు బుకింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో ఇలాంటి సూచనలు ఇవ్వడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది.









