దీపావళి అనగానే అందరికీ ముందుగా గుర్తువచ్చేది వెలుగులు, మిఠాయిలు, అలాగే శ్రీమహాలక్ష్మి పూజ. ఇంట్లో సిరిసంపదలు, ప్రశాంతత నిండాలని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడి పూజను ఎప్పుడు చేయాలి? ఏ పద్ధతులు పాటించాలి? లక్ష్మీదేవికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

దీపావళి రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూజ చేసుకోవడానికి చాలా మంచి సమయం. ఈ శుభ ముహూర్తంలో సంప్రదాయబద్ధంగా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే పూజకు ముందే దేవుడి మందిరాన్ని నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. చిరిగిన దేవుడి ఫోటోలు, విరిగిపోయిన విగ్రహాలు ఏవీ అక్కడ ఉంచకూడదు. అంతేకాదు గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహాన్ని పూజకు వాడకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఇక పూజలో లక్ష్మీదేవితో పాటు వినాయకుడి విగ్రహాన్ని తప్పకుండా పెట్టాలి. దేవుడి విగ్రహాలను ఎప్పుడూ నేరుగా నేల మీద కానీ, గోడకు ఆనించి కానీ ఉంచకూడదు. ఒక పీఠం వేసి దానిపై బియ్యం లేదా గోధుమలు పోసి ఆ పైన విగ్రహాలను ప్రతిష్ఠించాలి. వీలైతే శ్రీమహావిష్ణువు, సీతారాముల ఫోటోలను కూడా పూజలో పెట్టుకోవడం చాలా మంచిది.

పూజ చేసుకునే సమయంలో మనం వేసుకునే బట్టల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దీపావళి పూజ రోజు నలుపు లేదా తెలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. వాటికి బదులుగా పసుపు, ఎరుపు వంటి మంగళకరమైన రంగుల బట్టలు వేసుకోవడం మంచిది. ఇక అమ్మవారి నైవేద్యం విషయానికి వస్తే లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. పాలతో చేసిన మిఠాయిలు, కమలం లేదా గులాబీ పువ్వులు, తామర గింజలను అమ్మవారికి సమర్పిస్తే అనుగ్రహం లభిస్తుంది.

అలాగే పసుపు కొమ్ములు, పసుపు ఆవాలు, ధనియాలు, వెండి నాణెం, వక్కలు, జంధ్యం, సజ్జలు వంటి వస్తువులకు ఈ పూజలో ప్రత్యేక స్థానం ఉంది. వీటన్నింటినీ ఒక చిన్న గుడ్డలో మూటగా కట్టి పూజలో ఉంచి ఆ తర్వాత ఇంట్లో దాచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి పూజలో లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యంలో పొరపాటున కూడా తులసి ఆకులను వాడకూడదు.