BMW : ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 చివరి నాటికి ఏకంగా 8,000 ఉద్యోగాలను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జర్మనీలోని తమ పర్మినెట్ ఎంప్లాయిల్ లో దాదాపు సగం మందికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్‌ను అందించనున్నట్లు వెల్లడించింది.

జర్మనీలో బీఎండబ్ల్యూ సంస్థకు సుమారు 85,000 మంది పర్మినెట్ ఎంప్లాయిస్ ఉన్నారు. అందులో దాదాపు 40,000 మందికి అక్టోబర్ నుండి ఈ ఆఫర్‌లు అందనున్నాయి. అయితే ప్రొడక్షన్ లైన్ లో పనిచేసే కార్మికులను ఈ కోతల నుంచి మినహాయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూలో దాదాపు 1,54,000 మంది పనిచేస్తుండగా, జర్మనీలో డెస్క్-బేస్డ్ రోల్స్ నిర్వహించేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సమాచారం. బోర్డు సభ్యులు, బీఎండబ్ల్యూ వర్క్స్ కౌన్సిల్ మధ్య దాదాపు ఆరు వారాల పాటు చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రణాళికను ఖరారు చేశారు.

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల ద్వారా వచ్చే లాభాలు తగ్గడం, అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ కారణంగా జర్మనీ కార్ల తయారీ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డాయి. వోక్స్‌వ్యాగన్ సంస్థ కూడా తన 10 బ్రాండ్ల పరిధిలో లక్ష ఉద్యోగాల కోతపై ఆలోచిస్తుండగా, మెర్సిడెస్ బెంజ్ కూడా ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

పెట్రోల్, డీజిల్ కార్ల ఆప్షన్లను కూడా కస్టమర్ల కోసం కొనసాగించాలని ముందుగానే నిర్ణయించుకోవడం వల్ల బీఎండబ్ల్యూ ఇప్పటివరకు తన పోటీదారుల కంటే ఈ సంక్షోభాన్ని మెరుగ్గా ఎదుర్కొన్నట్లు కనిపించింది. మరోవైపు చైనాలో వ్యాపారం ఊహించినదానికంటే చాలా దారుణంగా దెబ్బతిన్నదని, తీవ్రమైన పోటీ, మందగించిన ఆర్థిక పరిస్థితుల కారణంగా గత నెలలో ఆ సంస్థ ఒక షాకింగ్ ప్రాఫిట్ వార్నింగ్ జారీ చేసింది. గత సంవత్సరమే చైనాలో బీఎండబ్ల్యూ వాహనాల డెలివరీలు 2017 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోగా, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో అమ్మకాలు ఏకంగా 30 శాతం క్షీణించాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.