Lok Sabha Speaker:మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి లోక్‌సభ అధికారికంగా ఆమోదం ముద్ర వేసింది. ఈ విలీన దరఖాస్తును స్పీకర్ పునఃసమీక్షించి ఓకే చేయడంతో దేశ రాజధాని వేదికగా మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఈ పరిణామంతో లోక్‌సభలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బలం కేవలం ముగ్గురు ఎంపీలకు పడిపోగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 13 మంది ఎంపీలకు చేరింది. ఫలితంగా పార్లమెంట్‌లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి సంఖ్యాబలం మరింత పెరిగింది. మరోవైపు లోక్‌సభలో విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది. దీనికి తోడు మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ వర్గాలు కూడా విలీనం దిశగా చర్చలు జరుపుతుండటం, ఆ తర్వాత వారు ఎన్డీయేకు మద్దతు ఇచ్చే యోచనలో ఉండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్, ఉద్ధవ్ వర్గాలు ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

మరో కీలక పరిణామంలో, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు కూడా లోక్‌సభలో భారీ షాక్ తగిలింది. టీఎంసీకి చెందిన 20 మంది చీలిక వర్గం ఎంపీలు ఇప్పటికే ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనమవగా, వారికి పార్లమెంట్‌లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించి, వేరుగా కూర్చునేందుకు వీలు కల్పించాలన్న సదరు ఎంపీల విజ్ఞప్తికి స్పీకర్ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏకకాలంలో ప్రాంతీయ శక్తులైన శివసేన (UBT), తృణమూల్ కాంగ్రెస్‌లలో చోటుచేసుకున్న ఈ తిరుగుబాట్లు , విలీన ప్రక్రియలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభలో ప్రతిపక్షాల బలం తగ్గడమే కాకుండా, రాబోయే రోజుల్లో పార్లమెంటరీ ఓటింగ్స్, బిల్లుల ఆమోదంపై ఈ కొత్త సమీకరణాలు విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.