
All Saturday Holiday : ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. SBI సహా అన్ని ప్రభుత్వ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇదంతా ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30, 2026 తేదీతో ఉన్న ఈ నోటిఫికేషన్లో.. ప్రతి శనివారం ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు అందులో చూపించారు. అధికారిక నోటిఫికేషన్లా కనిపించేలా ఫైల్ నంబర్, అధికారి పేరు కూడా పెట్టారు. అయితే ఈ నోటిఫికేషన్ను కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేయలేదని PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ గెజిట్ నోటిఫికేషన్ నకిలీదని స్పష్టం చేసింది.
Also Read : ప్రాణాలు పోతున్నా వెనక్కి తగ్గలేదు.. నీర్జా, స్మిత్ మచ్చర్ ఇద్దరూ హీరోలే!
A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI.#PIBFactCheck:
❌ The document… pic.twitter.com/ClCqEt2UAX
— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు నెలలో రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ విధానం 2015 నుంచి అమల్లో ఉంది. అయితే అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలనే డిమాండ్ బ్యాంకు ఉద్యోగుల నుంచి చాలా కాలంగా ఉంది. వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేసేలా చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా కేంద్రానికి ప్రతిపాదన ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించలేదు. కాబట్టి ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు అంటూ వస్తున్న వార్తను నమ్మొద్దని PIB సూచించింది.
Also Read : ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఫేక్ నోట్లు తయారీ.. కూరగాయల వ్యాపారి అరెస్ట్









