Varanasi : వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణికుడి తుపాకీ అనుకోకుండా పేలడంతో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది గాయపడ్డారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఆజంగఢ్‌కు చెందిన ఒక ప్రయాణికుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వెళ్లేందుకు వారణాసి విమానాశ్రయానికి వచ్చాడు. ఆయన వద్ద ఒక పిస్టల్, దాని మ్యాగజైన్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం విమానం ఎక్కే ముందే ఆయన తన వద్ద తుపాకీ ఉందనే విషయాన్ని అధికారులకు వెల్లడించారు.

ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ విభాగానికి చెందిన అధికారులు, ప్రయాణికుడి సమక్షంలో ఆ తుపాకీ దానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకొచ్చింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ మొదట నేలను తాకి, ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న స్క్రీనింగ్ సిబ్బందికి తగిలింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా ఉద్యోగి తొడ భాగంలో బుల్లెట్ గాయం కాగా, మరొక పురుష ఉద్యోగి చేతికి గాయమైంది.

గాయపడిన ఇద్దరు సిబ్బందిని వెంటనే సమీపంలోని న్యూ లక్ష్మి ట్రౌమా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి సురక్షితంగానే ఉందని, ప్రమాదమేమీ లేదని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో తీవ్ర విచారణ జరుపుతున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.