
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ మృతి కేసులో సీబీఐ కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో శివసేన యూబీటీ నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేతో పాటు నటులు డినో మోరియా, రియా చక్రవర్తి, సూరజ్ పంచోలి తదితరుల పేర్లు ప్రస్తావించింది. దిశా సలియన్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హత్య, సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అంశాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, మరికొందరు వ్యక్తులు కుట్రలో, ఆ తర్వాత జరిగిన కప్పిపుచ్చే ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే సంబంధిత ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారుల పాత్రను కూడా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది. కేసుకు సంబంధించిన పత్రాలు, ఫైళ్లు, ఇతర అధికారిక రికార్డులను ధ్వంసం చేయడం లేదా దాచిపెట్టడం, తప్పుడు అధికారిక రికార్డులు తయారు చేయడం, ప్రభుత్వ నిధులు, సిబ్బంది, పోలీసు వ్యవస్థను అక్రమంగా ఉపయోగించడం వంటి అంశాలపై కూడా విచారణ అవసరమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తితో పాటు ఆలస్యంగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, సిబ్బంది పాత్రలను కూడా పరిశీలించాల్సి ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉండటం మాత్రమే నేరం రుజువైనట్లు కాదని, దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంటుంది.
దిశా సలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడిపోయి మృతి చెందారు. ఆమె మరణానికి కొన్ని రోజుల తర్వాతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా బాంద్రాలోని తన నివాసంలో మృతిచెందారు. దిశా మృతి ఘటనపై అప్పట్లో ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేసి ఆమెది ఆత్మహత్య కేసుగా పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీశ్ సలియన్ మాత్రం తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ ఆరోపణలు చేశారు.









