Ladki Bahin Scheme : మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మాజీ లడ్కీ బహిన్ యోజనకు సంబంధించి భారీ సంఖ్యలో లబ్ధిదారుల పేర్లు తొలగిపోవడం సంచలనంగా మారింది. ఈ పథకం నుంచి దాదాపు 92 లక్షల మంది మహిళల పేర్లను ప్రభుత్వం తొలగించింది. ప్రారంభంలో మొత్తం 2.4 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పుడు అందులో సుమారు 38 శాతం మంది పేర్లు జాబితా నుంచి తొలగిపోయాయి.

Also Read : గుడ్‌న్యూస్: త్వరలోనే 10 కేజీల కమర్షియల్ సిలిండర్.. ధర ఎంతంటే?

ఈ తొలగింపుకు ప్రధాన కారణాలను ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 55 లక్షల మంది మహిళలు గడువులోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. అలాగే, 12 లక్షల మంది మహిళల కుటుంబ వార్షికాదాయం నిర్ణీత పరిమితి (రూ. 2.5 లక్షలు) కంటే ఎక్కువగా ఉండటం, 4.5 లక్షల మందికి పైగా మహిళలు వయోపరిమితి (65 ఏళ్లు) దాటడం వల్ల వారి పేర్లను తొలగించారు. ఆశ్చర్యకరంగా, ఈ పథకానికి అనర్హులైన సుమారు 14,000 మంది పురుషులు కూడా దరఖాస్తు చేసుకోగా, వారిని కూడా జాబితా నుంచి తొలగించారు. జిల్లాల వారీగా చూస్తే, బీడ్ జిల్లాలో అత్యధికంగా 28 లక్షల మంది పేర్లు తొలగిపోయాయి.

ఈ పరిణామాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం కోసం చేస్తున్న ఖర్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర భారాన్ని మోపుతుందని నివేదికలో హెచ్చరించింది. 2023-24లో మహిళా సంక్షేమం కోసం రూ. 261.78 కోట్లు ఖర్చు చేయగా, ఈ పథకం ప్రారంభమైన తర్వాత 2024-25 నాటికి ఆ వ్యయం రూ. 33,554.36 కోట్లకు పెరగడంపై CAG అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తప్పుగా పేర్లు తొలగించబడ్డాయని ఫిర్యాదులు చేసిన వారిపై ప్రభుత్వం మళ్లీ పరిశీలన జరుపుతోంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక తుది లబ్ధిదారుల సంఖ్య ఖరారు కానుంది.

Also Read : అయోధ్య రామమందిరానికి CEO పోస్టు : నోటిఫికేషన్ జారీ.. క్వాలిఫికేషన్స్ ఇవే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.