Maharashtra

Maharashtra : మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పుణె జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు మట్టి దిబ్బల కింద సమాధి అయ్యాయి. అంతేకాకుండా, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పాత ముంబై-పుణె హైవేపై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ రెండు నగరాల మధ్య రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ ఘోర ప్రమాదంలో నందు తికోనే (60), మౌలి తికోనే (30), అనితా తికోనే (55) అనే ముగ్గురు మరణించారు. మావల్ తాలూకాలోని పటాన్ గ్రామంలో తెల్లవారుజామున సుమారు 4:25 గంటల సమయంలో కొండ ఒక భాగం ఒక్కసారిగా ఇళ్లపై విరిగిపడింది. ఈ సమయంలో సుమారు 30 నుంచి 35 మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఐదు ఇళ్లు పూర్తిగా మట్టి కింద పూడిపోయాయి. సమాచారం అందుకున్న NDRF కి చెందిన 30 మంది నిపుణుల బృందం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా, మరో శవం కోసం మట్టిని తొలగించే పని జరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఈ మారుమూల గ్రామంలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు.

ఈ కొండచరియల ప్రభావం ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై తీవ్రంగా పడింది. భారీ వర్షాల కారణంగా దాదాపు 100 టన్నుల మట్టి, రాళ్లు ఎక్స్‌ప్రెస్‌వేపై వచ్చి పడ్డాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకు 70 శాతం మట్టిని తొలగించామని ఆయన చెప్పారు. పుణె నుంచి ముంబై వెళ్లే వైపు ఒక లైన్‌ను ప్రస్తుతం పునరుద్ధరించామని, రాబోయే కొన్ని గంటల్లో హైవేను పూర్తిగా అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితి సద్దుమణిగే వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరూ ముంబై-పుణె మధ్య ప్రయాణాలు చేయవద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. రెండు నెలల క్రితమే ప్రారంభమైన 13 కిలోమీటర్ల ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే లింక్ రోడ్డు కూడా ఈ వర్షాల వల్ల ప్రభావితమైంది.

Also Read : పచ్చని పందిట్లో ‘వధూ’ రూపంలో కాలనాగు.. ప్రియుడితో కలసి నవవరుడి దారణహత్య

రెడ్ అలర్ట్ జారీ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముంబైతో పాటుగా పరిసర ప్రాంతాలలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముంబై, థానే, రాయగఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. రోడ్లపైకి నీరు చేరడం, రైల్వే ట్రాక్‌లపై కొండచరియలు పడటంతో రైలు సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం సాయంత్రం సముద్రంలో 4.08 మీటర్ల మేర హైటైడ్ వచ్చే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

మరోవైపు, ముంబైలో వర్షాల కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లో చెట్లు విరిగిపడి ఇద్దరు చనిపోగా.. జూన్ 30న స్కూల్ బస్సుపై చెట్టు పడి ఒక బాలుడు మృతి చెందాడు. అలాగే, ఆదివారం ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఒక చాల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

Also Read: రూ.600 కోట్ల ఆస్తి.. మనవడి మరణాన్ని తట్టుకోలేక..కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం…

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.