భారత రాజకీయాల్లో 2 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ నవంబర్ 10న విడుదలైంది. ఇటలీలోని ఒక చిన్న పట్టణం నుండి భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంలోకి అడుగుపెట్టడం, రాజీవ్ గాంధీతో వివాహం, ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీల హత్యలు, ఆ తర్వాత ఆమె రాజకీయ ప్రస్థానం గురించి ఈ పుస్తకం ఎంతో భావోద్వేగంగా వివరిస్తుంది. అయితే, ఈ పర్సనల్ జర్నీ ఎంత హృద్యంగా ఉందో, ఇందులోని చారిత్రక మరియు రాజకీయ వాస్తవాలు అంతే గందరగోళంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యాంగపరమైన అంశాలపైనే తడబాటు!

సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా ఉన్న సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారని, రాజ్యసభ సభ్యులు నామినేట్ అవుతారని రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి రాజ్యసభలోని 238 మంది సభ్యులు రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్షంగా ఎన్నికవుతారు, కేవలం 12 మందిని మాత్రమే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఇలాంటి ప్రాథమిక అంశాలతో సహా ఈ పుస్తకంలో సుమారు 55 ఫ్యాక్చువల్ అలాగే తప్పులు ఉన్నాయని విశ్లేషకులు గుర్తించారు.

చారిత్రక తేదీలు, ఘటనల్లో పొరపాట్లు పుస్తకంలో ఎడిటింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిలో కొన్ని ప్రధాన తప్పిదాలు:

  • RSS స్థాపన: RSS 1921లో స్థాపించబడిందని సోనియా పేర్కొన్నారు. కానీ 1925లో నాగ్‌పూర్‌లో కె.బి. హెడ్గేవార్ దీనిని స్థాపించారు.

  • అహ్మద్ పటేల్ మరణం: తన అత్యంత సన్నిహితుడైన అహ్మద్ పటేల్ 2022లో కోవిడ్-19తో మరణించారని రాశారు. నిజానికి ఆయన 2020 నవంబర్ 25న కన్నుమూశారు.

  • గుజరాత్ అల్లర్లు: 2002 గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావిస్తూ అహ్మదాబాద్‌ను రాష్ట్ర రాజధానిగా పేర్కొన్నారు (1970 నుండే గాంధీనగర్ రాజధానిగా ఉంది). అలాగే గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు బోగీలు తగలబడ్డాయని రాశారు, కానీ కేవలం S-6 బోగీ మాత్రమే దగ్ధమైంది.

  • ఎన్నికల లెక్కలు: 2014 ఎన్నికల్లో NDA కూటమికి 353 సీట్లు వచ్చాయని రాశారు. కానీ ఆ ఏడాది ఎన్డీయే గెలుచుకున్నది 336 సీట్లు మాత్రమే (353 సీట్లు 2019 ఎన్నికల్లో వచ్చాయి). 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లను ఒకచోట 405 అని, మరోచోట 404 అని వేర్వేరుగా ప్రస్తావించారు.

కార్గిల్ యుద్ధం & రాహుల్ గాంధీ కేసుపై తప్పుడు సమాచారం

1999 కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్‌పేయి ఇస్లామాబాద్‌లో నవాజ్ షరీఫ్ ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు చొరబాట్లు జరిగాయని రాశారు. వాజ్‌పేయి ఫిబ్రవరి 1999లో లాహోర్ వెళ్లగా, మే 3న చొరబాట్లు బయటపడ్డాయి. అలాగే కార్గిల్ ఆపరేషన్ 10 నెలలు సాగిందని పేర్కొన్నారు, కానీ మే నుండి జూలై 1999 మధ్య కేవలం మూడు నెలల్లోనే యుద్ధం ముగిసింది.

ఇక రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు విషయానికి వస్తే.. 2023లో కేసు నమోదైందని, గుజరాత్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిందని రాశారు. వాస్తవానికి 2019లో కేసు నమోదు కాగా, మార్చి 2023లో సూరత్ మెజిస్ట్రేట్ కోర్టు శిక్ష విధించింది. సుప్రీంకోర్టు శిక్షను సస్పెండ్ చేయడం వల్ల ఏడాది తర్వాత రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించబడిందని రాశారు; కానీ సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించడంతో ఐదు నెలల్లోపే ఆయన లోక్‌సభ సభ్యత్వం తిరిగి వచ్చింది.

అంతర్జాతీయ అంశాల్లోనూ గందరగోళం

నెల్సన్ మండేలా 1990లో భారతరత్న అందుకుంటే, 1991 అని రాశారు. 1994లో మండేలా ప్రమాణ స్వీకారానికి భారత బృందానికి ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ నేతృత్వం వహిస్తే, ‘రాష్ట్రపతి ఆర్.కె. నారాయణ్’ అని తప్పుగా పేర్కొన్నారు. చైనా నేత డెంగ్ జియావోపింగ్‌ను అప్పటి చైనా అధ్యక్షుడిగా రాయడం, రాజీవ్ గాంధీతో తన మొదటి పరిచయం నాటి వయసుల లెక్కల్లో తేడాలు ఉండటం గమనార్హం.

ఒక ఆత్మకథను చరిత్ర పాఠ్యపుస్తకంలా చూడలేం. సోనియా గాంధీ వ్యక్తిగత జ్ఞాపకాలు, పోరాటాలు ఈ పుస్తకానికి ప్రధాన బలం. అయితే, దేశ చరిత్రను ప్రభావితం చేసిన కీలక ఘటనలను ప్రస్తావించేటప్పుడు పబ్లిషర్లు, ఎడిటర్లు కనీస ఫ్యాక్ట్-చెక్ చేసి ఉంటే, ఈ అద్భుతమైన వ్యక్తిగత కథనానికి ఇలాంటి చిన్నపాటి తప్పిదాల వల్ల మచ్చ పడేది కాదు.