
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బుక్’ బెట్టింగ్ స్కామ్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకార్ ఎట్టకేలకు భారత దర్యాప్తు సంస్థల చేతికి చిక్కాడు. ఒమన్ సుల్తానేట్ సహకారంతో CBI అతడిని విజయవంతంగా మస్కట్ నుంచి భారత్కు రప్పించింది. విదేశాల్లో తలదాచుకుంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్న ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడంలో భారత ప్రభుత్వానికి ఇది దక్కిన అతిపెద్ద విజయం.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ, ఈ సిండికేట్ గుట్టును రట్టు చేసింది. నిందితులు విదేశాల్లో ఉంటూ భారత్లోని వివిధ రాష్ట్రాల్లో ఫ్రాంచైజ్ “ప్యానెల్స్”, బ్రాంచీల నెట్వర్క్ను విస్తరించారు.
క్రికెట్, ఫుట్బాల్, కార్డ్ గేమ్స్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్పై భారీగా ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించారు.
అమాయకుల వివరాలతో తెరిచిన వేలాది ‘మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్’ ద్వారా బెట్టింగ్ డబ్బును సేకరించారు.
ఆ మొత్తాన్ని పలు బ్యాంకింగ్ లేయర్ల ద్వారా మళ్లించి, చివరికి హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించారు.
ఈ రాకెట్ సజావుగా సాగడానికి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు భారీగా ప్రొటెక్షన్ ఫీజుల పేరిట లంచాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.
సౌరభ్ చంద్రకార్పై జారీ అయిన ఇంటర్పోల్ ‘రెడ్ కార్నర్ నోటీస్’ ఆధారంగా ఒమన్ రాయల్ పోలీస్ అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పక్కా ఆధారాలతో లీగల్ డాక్యుమెంట్లను ఒమన్ ప్రభుత్వానికి సమర్పించాయి.
అనుమతి లభించగానే స్పెషల్ సీబీఐ టీమ్ మస్కట్ వెళ్లి నిందితుడిని కస్టడీలోకి తీసుకుని భారత్కు తీసుకొచ్చింది. ఈ ఆపరేషన్లో కీలక సహకారం అందించినందుకు ఒమన్ రాయల్ పోలీసులకు సీబీఐ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
సౌరభ్ చంద్రకార్పై ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, చీటింగ్, ఫోర్జరీ, ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్లతో పాటు ఛత్తీస్గఢ్ గేమింగ్ యాక్ట్ కింద ఛార్జిషీట్లు నమోదయ్యాయి. ఈ కేసులో ఈడీ ఇప్పటికే దేశవిదేశాల్లోని వందల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. పరారీలో ఉన్న నేరస్థులకు ఈ అప్పగింత ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.









