Pakistan : విద్యుత్ కోతలు, గంటల తరబడి బ్లాక్‌అవుట్‌లు, వంట గ్యాస్ కొరత.. ప్రస్తుతం పొరుగు దేశం పాకిస్తాన్‌ను అతలాకుతలం చేస్తున్న ప్రధాన సమస్య ఇది. ఈ ఎనర్జీ క్రైసిస్ వెనుక ఉన్న అసలు కారణం LNG (Liquefied Natural Gas).

Also Read : ‘మరో ఎపిక్ ఫ్యూరీ తప్పదు’: ఇరాన్‌కు ట్రంప్ సంచలన వార్నింగ్!

అసలు LNG అంటే ఏమిటి?

భూగర్భం లేదా సముద్ర గర్భం నుంచి తీసిన నాచురల్ గ్యాస్ మైనస్ 162 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరిచినప్పుడు అది ద్రవరూపంలోకి మారుతుంది. దీనివల్ల గ్యాస్ పరిమాణం సుమారు 600 రెట్లు తగ్గుతుంది. ఫలితంగా భారీ ట్యాంకర్లు, కార్గో షిప్‌లలో ఇతర దేశాలకు రవాణా చేయడం అత్యంత సులభమవుతుంది. గమ్యస్థానానికి చేరాక, ప్రత్యేక రీ-గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ద్వారా మళ్లీ గ్యాస్‌గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, ఎరువుల పరిశ్రమలు, CNG వాహనాలు మరియు ఇళ్లలో పైప్డ్ గ్యాస్ (PNG) కోసం ఉపయోగిస్తారు.

పాకిస్తాన్ ఎందుకు చిక్కుల్లో పడింది?

పాకిస్తాన్ తన ఎల్ఎన్జి అవసరాలలో 90 శాతానికి పైగా ఖతార్‌పైనే ఆధారపడింది. అయితే సముద్ర రవాణా మార్గాల్లో ఆటంకాలు, సరఫరా కొరత కారణంగా దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ఓపెన్ స్పాట్ మార్కెట్ లో గ్యాస్ కొనాల్సి వచ్చింది. కానీ దేశంలో తీవ్ర విదేశీ మారకద్రవ్య కొరత ఉండటంతో, రికార్డు స్థాయికి చేరిన అంతర్జాతీయ ధరలను పాకిస్తాన్ భరించలేకపోయింది. అధిక రేట్లు ఆఫర్ చేసిన యూరప్, ఇతర ఆసియా దేశాలకే గ్లోబల్ సప్లయర్లు ప్రాధాన్యత ఇవ్వడంతో పాక్‌కు సరుకు నిలిచిపోయింది. గ్యాస్ లేక విద్యుత్ ప్లాంట్లు మూతపడటంతో, ప్రభుత్వం నాసిరకం బొగ్గు, ఫర్నేస్ ఆయిల్‌ను వాడటం మొదలుపెట్టింది. ఫలితంగా లాహోర్ వంటి నగరాల్లో కాలుష్యం, ప్రాణాంతక పొగమంచు విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read : శిక్ష పూర్తయినా జైళ్లలోనే.. బంగ్లాదేశ్ జైళ్లలో సగానికి పైగా భారతీయులే!

ప్రపంచంలో టాప్ సప్లయర్స్ ఎవరు?

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఈ దేశాలదే హవా:

  • అమెరికా (USA): షేల్ గ్యాస్ బూమ్‌తో ప్రపంచంలోనే నంబర్ 1 LNG ఎగుమతిదారు.

  • ఖతార్: భారీ నార్త్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌తో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం.

  • ఆస్ట్రేలియా: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన సరఫరాదారు.

  • రష్యా, మలేషియా, నైజీరియా: గ్లోబల్ సప్లై చైన్‌లో టాప్-5లో ఉన్న ఇతర కీలక దేశాలు.