
ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చుట్టూ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం నాటి లంచం వ్యవహారంలో ఆయనపై ప్రాథమిక విచారణ జరిపేందుకు కేరళ ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అధికారికంగా అనుమతినిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(A) కింద విచారణకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోంమంత్రి రమేశ్ చెన్నితల ప్రకటించారు. ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో చర్చించిన అనంతరం, న్యాయ సలహా తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read : సర్కార్ సంచలన నిర్ణయం: రెండో పెళ్లి చేసుకుంటే జాబ్ ఖతమ్
రూ.2 కోట్ల లంచం డిమాండ్.. ఆరోపణలివే!
2006 ప్రాంతంలో జ్ఞానేశ్ కుమార్ కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో ఈ వివాదం మొదలైంది. కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (KSTP) కింద రోడ్డు పనులు చేపట్టిన మలేషియాకు చెందిన ‘పాటీ-బెల్’ (PATI-BEL) కన్సార్టియంకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఇంజినీర్లు ఇప్పటికే అప్రూవ్ చేసిన సుమారు రూ.17 కోట్ల విలువైన బిల్లుల చెక్కులను పీడబ్ల్యూడీ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఆపేశారని కొల్లాం జిల్లా చడయమంగళంకు చెందిన మాజీ సబ్-కాంట్రాక్టర్ వీ.ఓ. సాజన్ ఆరోపించారు.
ఆ చెక్కులను రిలీజ్ చేయాలంటే రూ.2 కోట్లు లంచం ఇవ్వాలని జ్ఞానేశ్ కుమార్ డిమాండ్ చేశారని సాజన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB)కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మలేషియా ఇంజినీర్ లీ సీ బీన్ ఈ విషయాన్ని తనకు స్వయంగా చెప్పారని, లంచం ఇచ్చేందుకు కంపెనీ ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని వెల్లడించారు. ఈ క్రమంలో వర్కర్లకు, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన లీ సీ బీన్ 2006లో ఆత్మహత్య చేసుకున్నారని సాజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రీ-ఇన్వెస్టిగేషన్ ఎందుకు?
2006లోనే లీ మరణం తర్వాత విజిలెన్స్ ప్రాథమిక విచారణ చేపట్టినప్పటికీ, సరైన ఆధారాలు లేవంటూ కేసును క్లోజ్ చేశారు. అయితే, ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షినైన తనను గానీ, కంపెనీ మాజీ ఉద్యోగులను గానీ విచారించకుండానే క్లీన్చిట్ ఇచ్చారని సాజన్ తాజాగా ఆరోపించారు. లీ రాసిన సూసైడ్ నోట్లో జ్ఞానేశ్ కుమార్ ప్రస్తావన ఉందని, విచారణకు అవసరమైన పూర్తి సాక్ష్యాలు, లీ కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తానని చెప్పడంతో కేసు మళ్లీ రీఓపెన్ అయ్యింది.
Also Read : జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.1000లకే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్..!
సీఈసీ పదవికి రక్షణ ఉండదా?
ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్ దేశ అత్యున్నత ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆయన పాత పరిపాలనా చర్యలపై విచారణ జరిపేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై విపక్షాలు సీఈసీపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలోనే, పాత లంచం కేసు తెరపైకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇంకా ఎలాంటి అధికారిక స్పందనను తెలియజేయలేదు.









