
కేవలం 6 నెలల వ్యవధిలోనే వివిధ కేసుల్లో 23 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జడ్జి రవి కుమార్ దివాకర్ తాజాగా బదిలీ అయ్యారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ముజఫర్‌నగర్‌లోని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జడ్జి రవి కుమార్ దివాకర్ తన పదవీకాలంలో ఇచ్చిన హై ప్రొఫైల్ జడ్జిమెంట్లు న్యాయవర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కేవలం ఆరు నెలల టైమ్‌లోనే ఏకంగా 11 కేసుల్లో 23 మందికి ఆయన మరణశిక్ష ఖరారు చేశారు. అంతకుముందు ఆయన బరేలీలో పనిచేసిన కాలంలో కూడా 13 డెత్ పెనాల్టీ తీర్పులు వెలువరించి వార్తల్లో నిలిచారు. కఠినమైన శిక్షలు విధిస్తూ ‘హ్యాంగింగ్ జడ్జి’గా పేరు తెచ్చుకున్న ఆయన బదిలీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ బదిలీ వెనుక మరో కీలక వివాదం కూడా ఉందని తెలుస్తోంది. హత్యలు, తీవ్రమైన నేరాలకు సంబంధించిన విచారణ దశలో ఉన్న 97 కేసులను మరో న్యాయమూర్తి ఆదేశాల మేరకు తన కోర్టు నుంచి ఉన్నపళంగా ఉపసంహరించుకోవడాన్ని (విత్‌డ్రా చేసుకోవడాన్ని) జడ్జి దివాకర్ బహిరంగంగానే తప్పుపట్టారు. పదేళ్ల నాటి కేసులో ఓ నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఆయన పరిపాలనా వ్యవహారాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చట్టబద్ధమైన ప్రొసీజర్ పాటించకుండా, కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ద్వారా ట్రయల్ నడుస్తున్న కేసులను ఇలా ఉపసంహరించుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలోని లోపాలపై ప్రశ్నలు సంధించిన కొద్దిరోజులకే ఆయనను ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయడం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.









