జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్‌‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ పెళ్లి ఫొటోలను షేర్‌ చేశారు.

అక్టోబర్‌ 30న తాము ఒక్కటయ్యామని, తమ జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలైందని ఒమర్‌ అబ్దుల్లా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద రిజిస్టర్ అయిన ఈ వివాహ వేడుకలు ఢిల్లీ, శ్రీనగర్‌లలో అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా జరిగాయి. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే ఈ ఈవెంట్‌కు హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌ పిక్చర్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన మూడు నెలలకే..

ఒమర్ అబ్దుల్లాకు గతంలో పాయల్ నాథ్‌తో 1994లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2011లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట, అప్పటి నుంచి వేర్వేరుగానే జీవిస్తున్నారు. విడాకుల కోసం ఒమర్ తొలుత ఫ్యామిలీ కోర్టును, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టు మెట్లెక్కారు.

సుదీర్ఘ కాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం, విడాకులు మంజూరు చేస్తామని మూడు నెలల క్రితం స్పష్టం చేసింది. లీగల్‌గా విడాకుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒమర్‌ అబ్దుల్లా – నిధి రజ్దాన్‌ల వివాహం జరగడం విశేషం. కొత్త జంటకు రాజకీయ, మీడియా వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.