ప్రపంచంలోనే లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ అయిన బైనాన్స్‌ భారీ సైబర్ ఎటాక్‌కు గురైంది. హ్యాకర్లు సంస్థ సిస్టమ్స్‌లోకి చొరబడి సుమారు 6.3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లు) విలువైన క్రిప్టో అసెట్స్‌ను కొల్లగొట్టారు. క్రిప్టో చరిత్రలోనే ఇది అత్యంత భారీ చోరీగా నిపుణులు చెబుతున్నారు. ఈ షాకింగ్ న్యూస్‌తో బిట్‌కాయిన్‌, ఇతర ప్రముఖ క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ ఏకంగా 5 శాతం మేర పడిపోయింది.

సంస్థ చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఒక డెవాప్స్ ఇంజినీర్ ల్యాప్‌టాప్ హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఆ డివైస్ ద్వారా ఇంటర్నల్ సర్వీస్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన హ్యాకర్లు, అనధికారికంగా భారీ మొత్తంలో ఫండ్స్‌ను వేరే అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 10 బ్లాక్‌చెయిన్లకు చెందిన వ్యాలెట్ల నుంచి నిధులను మళ్లించినట్లు TRM ల్యాబ్స్ వెల్లడించింది. అయితే, యూజర్ల వ్యాలెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు మాత్రం లీక్ కాలేదని బైనాన్స్ స్పష్టం చేసింది.

ఎటాక్ జరిగిన వెంటనే అప్రమత్తమైన బైనాన్స్, ముందు జాగ్రత్తగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. సెక్యూరిటీ ఆడిట్ పూర్తయ్యాక సర్వీసులను రీస్టార్ట్ చేస్తామని వెల్లడించింది. ఈ హ్యాకింగ్ వల్ల జరిగిన పూర్తి నష్టాన్ని తామే భరిస్తామని, యూజర్ల మనీకి ఎలాంటి ఢోకా లేదని సంస్థ కో-ఫౌండర్ యి హే హామీ ఇచ్చారు. అటు టెథర్, సర్కిల్, రిపుల్ వంటి ఇతర సంస్థలు కూడా స్పందించి అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేశాయి.

ఈ భారీ దాడి వెనుక నార్త్ కొరియాకు చెందిన కుఖ్యాతి చెందిన ‘ట్రేడర్‌ట్రెయిటర్’ హ్యాకింగ్ గ్రూప్ హస్తం ఉండొచ్చని అనలిటిక్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. 2025లో బైబిట్‌పై జరిగిన 1.5 బిలియన్ డాలర్ల చోరీ కంటే ఇది ఎన్నో రెట్లు పెద్దది కావడంతో, గ్లోబల్ ఇన్వెస్టర్లలో డిజిటల్ అసెట్స్ సెక్యూరిటీపై తీవ్ర ఆందోళన మొదలైంది.