
Fire accident : ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో సోమవారం ఒక భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అలీగంజ్ ప్రాంతంలోని పూర్నియా జంక్షన్ వద్ద ఉన్న ఒక వాణిజ్య సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం కింద ఉన్న ఒక దుకాణంలో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దురదృష్టవశాత్తూ ఆ భవనం పై అంతస్తులో ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ నడుస్తుండటంతో, ప్రమాద సమయంలో వందలాది మంది అభ్యర్థులు లోపల చిక్కుకుపోయారు.
మంటలు వ్యాపించడంతో పాటు భవనం మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులు ఊపిరాడక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రవేశ మార్గాల వైపు పరుగులు తీసినప్పటికీ, అప్పటికే అక్కడ మంటలు ముంచెత్తడంతో లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర భయాందోళనల మధ్య కొందరు అభ్యర్థులు కిటికీలు, భవనం అంచులు, పైకప్పు పైనుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అనేక ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అంతకంటే ముందే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. కిందకు దూకిన విద్యార్థులను, గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భవనం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు, నిచ్చెనల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.భవనంలో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఇంతలా పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే కింద ఉన్న దుకాణంలో మొదట మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు దట్టమైన పొగ కారణంగా భవనం లోపల స్పృహ తప్పి చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు, లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రక్షించేందుకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న బాధితుల్లో కొందరు ప్రాణభయంతో భవనం పైనుంచి దూకగా.. వారికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కోచింగ్ సెంటర్ కమ్ గేమింగ్ జోన్ ఉండటంతో పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు చిక్కుకున్నట్లు సమాచారం.









