Giribabu :  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన యర్రా శేషగిరిరావు అలియాస్ గిరిబాబు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటుడు దూరమయ్యారంటూ ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గిరిబాబు 1946 జూన్ 8లో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో జన్మించాడు. గిరిబాబు చాలా చిన్న వయసులోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఆయన వైవాహిక జీవితం సుమారు 53 ఏళ్లు. 2016 మే 12న శ్రీదేవి కన్నుమూశారు. ఆమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులు రఘుబాబు, బోసుబాబు. కుమార్తె పేరు మాధవి. భూ కైలాస్ సినిమాలో గిరిబాబు, రఘుబాబు, గిరిబాబు తండ్రి ఎర్ర నాగయ్య ముగ్గురూ నటించారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు ఒకే సినిమాలో కనిపించడం విశేషం. రఘుబాబు యాక్టర్ గా ఇండస్ట్రీలో మంచి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన చిన్న కుమారుడు బోసుబాబు మాత్రం స్థిరపడలేకపోయారు.

వాస్తవానికి బోసుబాబును హీరోగా చూడాలనుకున్నారు గిరిబాబు. అందులో భాగంగానే ఓ సినిమా కూడా ప్లాన్ చేశారు. అదే ఇంద్రజిత్తు.. అదే సమయంలో కైకాల నాగేశ్వర రావు చిరంజీవితో కొదమసింహం అనే సినిమా చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా కౌబాయ్ తరహా సినిమాలు కావడంతో బయ్యర్స్ కొదమసింహం కొనుక్కున్నారని తెలిపారు. దీంతో తన సినిమాను వాయిదా వేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో గిరిబాబు వెల్లడించారు. కొదమసింహం ప్లాప్ కావడంతో తన సినిమాను సగం రేటుకే అమ్మాల్సి వచ్చిందన్నారు. తాను రూ. 25 లక్షలు కోల్పోయినా బయ్యర్స్ మాత్రం లాభపడ్డారని తెలిపారు. సినిమా ప్లాప్ అని ముద్ర వేయడంతో తన కొడుకుతో రెండో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదని తెలిపారు గిరిబాబు. తన కొడుకును హీరోగా నిలబెట్టలేదన్న బాధ తనకు ఎప్పటికీ ఉంటుందన్నారు గిరిబాబు.

కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలిసి ఉండే కుటుంబ వ్యవస్థను ఆయన ఇష్టపడేవారు. కుటుంబం కలిసిమెలిసి ఉండటంలో తన భార్య పాత్ర ఎంతో గొప్పదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. తన స్వగ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణం కోసం 1.25 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2008లో గ్రామంలో క్రీడా మైదానాన్ని కూడా నిర్మించారు. కృష్ణతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో పనిచేశారు.

కేవలం నటుడిగానే పరిమితం కాకుండా గిరిబాబు గారు దర్శక, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకున్నారు. ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజీత్‌’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ‘రణరంగం’, ‘ఇంద్రజీత్‌’, ‘నీ సుఖమే నే కోరుకున్న’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. సినిమా నిర్మాణ రంగంలోని కష్టనష్టాలను తట్టుకుంటూ కళామతల్లికి ఆయన చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.