
హిందూ సంప్రదాయాల ప్రకారం ఆషాడంలో అత్తాకోడళ్లు ఒకే చోట ఉండకూడదని చెబుతారు. అలా ఉంటే వారిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్య, సైంటిఫిక్ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా ఆషాడం అంటే వర్షకాల ప్రారంభ సమయం. ఈ సమయంలో వాతావరణంలోని మార్పుల కారణంగా ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోయి రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఈ సమయంలో భర్తతో ఉంటే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ గర్భం దాల్చితే ఈ ఇన్ఫెక్షన్ల వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుంది.
అంతేకాకుండా ఈ నెలలో గర్భం దాల్చితే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డెలివరీ అవుతుంది. ఆ సమయంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. పూర్వకాలంలో ఫ్యాన్లు, ఏసీలు లేకపోయేవి, దీనివల్ల పురిటి బిడ్డ, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని నివారించడానికి పూర్వీకులు ఆషాడంలో అత్తాకోడళ్ళను, భార్య భర్తలను దూరం పెట్టే ఆచారం తెచ్చారు.
మరొక కారణం పెళ్ళైన అమ్మాయికి అత్తారింట్లో అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే పుట్టింటిపై బెంగ కూడా ఉంటుంది. కావున పెళ్ళైన కొన్ని నెలలకే వచ్చే ఈ ఆషాడంలో అమ్మాయిని పుట్టింటికి పంపడం వల్ల ఆమె బెంగ తీరుతుంది. ఈ ఎడబాటు వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా మరింత పెరుగుతుంది.









