Kajal Aggarwal : ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఫోన్ ఉంటోంది. కానీ పక్కన ఉన్న భార్యాభర్తలు మాత్రం ఒకరి మొహం ఒకరు చూసుకోవడం మానేశారు! రీసెంట్ ఇయర్స్ లో సెలబ్రిటీల నుంచి సాధారణ జంటల వరకు విడాకులు ఎందుకు పెరిగిపోతున్నాయి? దీనికి అసలైన విలన్ ఎవరూ అనుకుంటున్నారు? ఎవరో కాదు.. మన చేతిలో ఉన్న ఆ స్మార్ట్‌ఫోనే, ఈ సోషల్ మీడియానే అంటుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. పెళ్లిళ్లు పెటాకులు కావడానికి, బంధాలు ముక్కలు కావడానికి అసలు కారణం ఇదేనంటూ కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

రోజురోజుకూ సొసైటీలో విడాకుల కేసులు పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఎవరిని కదిలించినా ఇదే టాపిక్. అయితే ఈ ఇష్యూ మీద తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించింది. మనుషుల మధ్య అనుబంధాలు, ప్రేమ, పెళ్లిపై నేటి తరం ఆలోచనా విధానాన్ని సోషల్ మీడియా దారుణంగా ప్రభావితం చేస్తోందని ఆమె కుండబద్దలు కొట్టింది. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ లవ్ స్టోరీలు, హ్యాపీ కపుల్స్ రీల్స్ కనిపిస్తుంటాయి. అవన్నీ చూసి జనాలు తమ నిజ జీవితాన్ని వాటితో పోల్చుకుంటున్నారు. ‘అతను తన భార్యకి అలా చేశాడు, నా మొగుడు మాత్రం పట్టించుకోడు’ అంటూ అంతులేని కంపారిజన్ పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో కనిపించే ఆ ఫేక్ లైఫ్‌స్టైల్ వల్ల దంపతుల మీద తెలియని అదనపు ఒత్తిడి పెరుగుతోందని, అదే చివరకు పెద్ద పెద్ద గొడవలకు, విడాకులకు దారితీస్తోందని కాజల్ క్లియర్‌గా చెప్పింది.

అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే.. పెళ్లయిన కొత్తలో బాగానే ఉంటారు, ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకి, డిన్నర్ డేట్లకి వెళ్తారు. కానీ, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి, ఇద్దరి చేతుల్లోనూ ఫోన్లు ప్రత్యక్షమవుతాయి. పక్కనే లైఫ్ పార్ట్నర్ ఉన్నా కూడా.. ఆన్‌లైన్ ప్రపంచంలో, సోషల్ మీడియా రీల్స్ లో మునిగిపోతుంటారు. ఎదురుగా కూర్చున్న మనిషితో మనసు విప్పి మాట్లాడే తీరిక ఎవరికీ ఉండట్లేదు. కమ్యూనికేషన్, సహనం, ఒకరి మాట ఒకరు వినే ఓపిక పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్సే కాలక్రమేణా పెద్ద అగాధంలా మారుతున్నాయని కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది. నేటి జనరేషన్ జంటలు ఫేస్-టూ-ఫేస్ కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోతున్నాయని ఆమె అభిప్రాయపడింది.

మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కేవలం నీతులు చెప్పడం కాదు, కాజల్ తన నిజ జీవితంలో ఒక పర్‌ఫెక్ట్ రూల్ ఫాలో అవుతుందట! 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్.. ఒక బాబుకి తల్లి కూడా అయింది. ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ, తన భర్తతో బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఆమె ఒక చిన్న సీక్రెట్ రూల్ పెట్టుకుందట. వారానికి కనీసం ఒక్కసారైనా ఇద్దరూ కలిసి డిన్నర్‌కి వెళ్తారు. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది.. అదేంటంటే, ఇద్దరి మొబైల్ ఫోన్లు టేబుల్ మీద ఉండకూడదు, పూర్తిగా సైలెంట్ చేసి పక్కన పడేయాలి! ఎలాంటి డిజిటల్ డిస్టర్బెన్స్ లేకుండా కేవలం ఇద్దరూ ఒకరికొకరు టైమ్ ఇచ్చుకుంటారు. ఆ సమయంలో మనసులోని భావాలు, కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. ఈ చిన్న ట్రిక్ వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని కాజల్ చెబుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.