Peddi
Peddi

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది.  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. అయితే ఈ క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సినిమా క్రేజ్ ఎంతలా ఉందో తెలీదు కానీ.. సినిమా చూడటానికి ఏకంగా దొంగ నోట్లను మార్కెట్లోకి వదిలారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.

Also Read: ‘పెద్ది’లో ఆ సీన్స్ అన్ని కట్.. రీ ఎడిట్ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..?

నరసరావుపేట పట్టణంలోని కాసు మల్టీఫ్లెక్స్ థియేటర్‌లో ఈ విస్తుపోయే ఉదంతం వెలుగుచూసింది. ప్రస్తుతం థియేటర్‌లో పెద్ది సినిమా నడుస్తుండటంతో ప్రేక్షకుల రద్దీ విపరీతంగా ఉంది. కౌంటర్ల వద్ద టికెట్లు, స్నాక్స్ కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ విపరీతమైన రద్దీని ఆసరాగా చేసుకున్న కొందరు అపరిచిత వ్యక్తులు టికెట్ కౌంటర్, క్యాంటీన్లలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నోట్లను ఇచ్చి మార్చేశారు. కలెక్షన్ల కౌంటింగ్ సమయంలో నోట్లు తేడాగా ఉండటాన్ని గమనించిన థియేటర్ సిబ్బంది.. అవి దొంగ నోట్లని గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

రద్దీగా ఉన్న సమయంలో లైన్లలో నిల్చుని ఈ దొంగ నోట్లను చలామణి చేసినట్లు థియేటర్ యాజమాన్యం ప్రాథమికంగా గుర్తించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సమయంలో టికెట్ కౌంటర్ వద్ద, క్యాంటీన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు, థియేటర్ నిర్వాహకులు జల్లెడ పడుతున్నారు. ఈ నకిలీ నోట్లను ఎవరు తెచ్చారు? దీని వెనుక ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Also Read: జాన్వీ కపూర్ పెద్ది వివాదం.. ఎంపీ జయా బచ్చన్ ఫైర్!

సినిమా హాళ్లలోనే కాదు

సినిమా హాళ్లలోనే కాదు, మార్కెట్‌లోనూ ఈ నకిలీ నోట్లు చెలామణి అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్ల నిర్వాహకులు నగదు తీసుకునేటప్పుడు నకిలీ నోట్ల గుర్తింపు యంత్రాలను వాడాలని, జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. సినిమా టికెట్ల కోసం, పాప్‌కార్న్ కోసం కూడా దొంగ నోట్లను వాడే స్థాయికి కేటుగాళ్లు తెగించడంతో స్థానిక జనాలు సినిమా పిచ్చి మరీ ఇంత ముదిరిపోయిందేంట్రా బాబు అని ముక్కున వేలేసుకుంటున్నారు.