
Sudha Kongara : ఆకాశం నీ హద్దురా ఫేమ్ డైరెక్టర్ సుధా కొంగర మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. శివకార్తికేయన్ హీరోగా ఆమె దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు గానూ తనకు రావాల్సిన రూ. 8.39 కోట్ల బాకీ డబ్బులను ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టులో కేసు వేశారు. ఈ సినిమాను నిర్మించిన డాన్ పిక్చర్స్ సంస్థతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం తనకు మొత్తం రూ. 15 కోట్లు (జీఎస్టీతో కలిపి రూ. 17.70 కోట్లు) ఇవ్వాల్సి ఉందని, కానీ ఇప్పటివరకు కేవలం రూ. 9.31 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆమె కోర్టుకు తెలిపారు. మిగిలిన రూ. 8.39 కోట్లు ఇవ్వకుండా ప్రొడక్షన్ హౌస్ వేధిస్తోందని సుధా కొంగర లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : ఈ వారం థియేటర్, ఓటీటీలో ఫుల్ జోష్.. సినిమాలు, సిరీస్‌లివే..!
అంతేకాకుండా, ఇదే డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇదయం మురళి అనే మరో కొత్త సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా అడ్డుకోవాలని, అలాగే పరాశక్తి సినిమాను టీవీల్లో ప్రసారం చేయకుండా స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ కుమారేష్ బాబు.. పరాశక్తి సినిమాను టీవీల్లో ప్రసారం చేయవద్దని తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, జూలై 8 లోగా దీనిపై సమాధానం చెప్పాలని సదరు నిర్మాణ సంస్థను ఆదేశించారు. పరాశక్తి సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసి సక్సెస్ అయిందని నిర్మాతలు ప్రకటించుకున్నారని, అయినా తన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని సుధా కొంగర తరఫు లాయర్లు వాదించారు.
శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పరాశక్తి సినిమా ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా సెన్సార్ బోర్డు దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాకు UA సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందు.. సెన్సార్ బోర్డు అధికారులు ఏకంగా 25 మార్పులు, కటింగ్‌లు చేయాలని ఆర్డర్ వేశారు. కొన్ని బూతు మాటలను మ్యూట్ చేయడంతో పాటు, సమాజంలో వివాదాలకు కారణమయ్యేలా ఉన్న కొన్ని డైలాగులను, సీన్లను పూర్తిగా తొలగించమని చెప్పారు.
Also Read : బుడ్డొడి రేంజ్ మాములుగా లేదుగా.. కళ్లు చెదిరే రెమ్యూనరేషన్!









