
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం వీరికి రెండోసారి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని దీపికా, రణ్‌వీర్ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారి పాదాల ముద్ర ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. వెల్‌కమ్ బేబీ గర్ల్. 19/9/2026. దువా, దీపికా & రణ్‌వీర్ అని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
దీపికా, రణ్‌వీర్ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రకటించారు. డెలివరీకి ముందు ఇటీవల ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెప్టెంబర్ 8న తమ మొదటి కుమార్తె దువా పుట్టినరోజు సందర్భంగా దీపికా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. బేబీ దువా, మా హృదయాలు మరింత పెద్దవవుతున్నాయి. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ రణ్‌వీర్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
రెండో బిడ్డ రాకకు ముందు ఈ దంపతులు ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంతో పాటు లాల్‌బాగ్చా రాజాను దర్శించుకుని బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. దీపికా, రణ్‌వీర్‌లకు మొదటి కుమార్తె దువా 2024 సెప్టెంబర్ 8న జన్మించింది. దువా పుట్టడానికి రెండు రోజుల ముందు కూడా ఈ జంట సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించింది.
ఇక దీపికా, రణ్‌వీర్ ప్రేమకథ విషయానికి వస్తే.. 2012లో గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తోంది. 2015లో వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో దీపికా, రణ్‌వీర్ వివాహం జరిగింది. ఇప్పుడు రెండోసారి ఆడబిడ్డకు తల్లిదండ్రులు కావడంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది.









