
Bigg Boss Bangla Season 3 : పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్‌బాస్ షో బంగ్లా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సీజన్ 3తో ఈ రియాలిటీ షో మరోసారి సందడి చేయబోతోంది. గతంలో నటులు మిథున్ చక్రవర్తి, జీత్ హోస్ట్‌లుగా వ్యవహరించగా.. ఈసారి మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలను మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సుమారు 15 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్లో పాల్గొనే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అందులో మొనామి ఘోష్, అనింద్య సెంగుప్తా, ఝిలమ్ గుప్తా, సీన్ బెనర్జీ, శ్రీజ్లా గుహ, దీపేందు బిశ్వాస్, నందిని దత్తా తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి పేర్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈసారి బిగ్‌బాస్ ఇల్లు కూడా ప్రత్యేకంగా ఉండనుంది. శ్యామ్ భట్ ఈ ఇంటిని డిజైన్ చేశారు. దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఏర్పాటు చేశారు. ఇంట్లో ఏ మూలన ఏం జరుగుతుందో మిస్ కాకుండా 55కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్ ఇంటి డిజైన్‌లో బెంగాల్ ప్రత్యేకతలను చూపించారు. బెంగాల్‌కు గుర్తుగా నిలిచే గ్రేట్ బెంగాల్ టైగర్, సంగీతంపై అక్కడి ప్రజలకు ఉన్న ప్రేమ, చేపలు, పాత ట్రామ్‌లు, అంబాసిడర్ ట్యాక్సీలను డిజైన్‌లో భాగంగా చూపించారు.
బిగ్‌బాస్ బంగ్లా సీజన్ 3 గ్రాండ్ ప్రీమియర్ ఆగస్టు 20న రాత్రి 8 గంటలకు స్టార్ జల్షాలో ప్రసారం కానుంది. రెగ్యులర్ ఎపిసోడ్లు ఆగస్టు 31 నుంచి సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతాయి. సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోను JioHotstarలో కూడా అదే సమయంలో చూడొచ్చు. యాప్‌లో 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.
బిగ్‌బాస్ బంగ్లా తిరిగి రావడంపై ఎండెమోల్ షైన్ ఇండియా సీఈఓ రిషి నేగి గతంలో స్పందించారు. ప్రస్తుతం హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో బిగ్‌బాస్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. 2026లో బిగ్‌బాస్ బంగ్లాను కూడా ఈ జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని చిన్న చిన్న మార్కెట్లకు కూడా బిగ్‌బాస్‌ను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని రిషి నేగి చెప్పారు. బంగ్లా మార్కెట్లో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుందని, ఈసారి కంటెంట్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.









