Gold :  సోషల్‌ మీడియాలో ఎక్కువ వ్యక్తిగత వివరాలు షేర్‌ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. యూట్యూబ్‌లో తమ బంగారం, డబ్బును చూపిస్తూ వీడియో పెట్టిన ఓ దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి ఏకంగా 118 సవర్ల బంగారంతో పాటు పెద్ద మొత్తంలో నగదును ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన నాగర్‌కోయిల్‌ సమీపంలోని తమ్మట్టుకొణంలోని వీఐపీ గార్డెన్‌లో జరిగింది. ఇక్కడ యూట్యూబర్‌ దంపతులు వినోద్‌ కుమార్‌, మధుమిత నివసిస్తున్నారు. చోరీ జరగడానికి కొన్ని రోజుల ముందు మధుమిత తమ పూజ గదిలో ఉన్న బంగారం, కుటుంబానికి సంబంధించిన విలువైన వస్తువులను చూపిస్తూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

వీడియో వైరల్‌ అయిన కొద్ది రోజులకే వారి ఇంట్లో దొంగలు పడ్డారు. హైసెక్యూరిటీ రెసిడెన్షియల్‌ ప్రాంతం కావడంతో పాటు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ దొంగలు ఇంటి వెనుక తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న 118 సవర్ల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనపై రాజాకమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే స్థానిక మొబైల్‌ నెట్‌వర్క్‌ కాల్‌ రికార్డులను కూడా పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.