Crime News : ఒకపుడు వరకట్నం పేరుతో యువతుల ప్రాణాలు తీసిన ఘటనలు చూశాం. తాజాగా అక్రమసంబంధాల నేపథ్యంలో భర్తలను మట్టుబెడుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే నిశ్చిరార్థం చేసుకుని ఇంకా పెళ్లి కాకముందే  అబ్బాయిని బెదిరించడం మొదలు పెట్టిందో యువతి. అమ్మాయి వ్యవహారం నచ్చక నిశ్చిరార్థం రద్దు చేసుకున్నాడ యువకుడు. దీంతో యువతి ఆ యువకుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, ఆ కేసు ఉపసంహరించు కోవాలంటే రూ.3కోట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే యువకుడితో పాటు కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగింది యువతి. దీంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

Also Read : వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన ఢిల్లీ టెక్కీ.. రూ. 12.75 లక్షలతో ఎస్కేప్!

వివరాల ప్రకారం ఏపీలోని తిరుపతికి చెందిన వంశీ పోస్టల్‌ కాలనీలో ఉంటూ  చెన్నై విజయ హాస్పిటల్‌లో సైంటిస్టుగా పనిచేస్తు్న్నాడు.ఆయనకు ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన యువతి నమ్రత పరిచయమైంది. ఆమె న్యూఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌ గా పనిచేస్తుంది. ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఇష్టపడి పెద్దల అంగీకారంతో ఏడాది క్రితం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అక్కడివరకు అంతా బాగానే సాగింది. అయితే ఎంగేజ్‌మెంట్‌ తర్వాత నమ్రత  తన అసలు రూపం భయటపెడుతూ వచ్చింది. వంశీ కుటుంబానికి చెందిన ఆస్తులు తన పేరిట మార్చాలని, నగదు పంపమని ఒత్తిడి తీసుకురావడం పెట్టింది. ఒక దశలో బెదిరింపులకు దిగింది.

నమ్రత బెదిరింపులు ఎక్కువకావడంతో పెళ్లికి ముందే ఇలా ఉంటే తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఊహించుకున్న వంశీ కుటుంబం పెద్దల ద్వారా ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్నారు. అయితే ఇది నచ్చని నమ్రత వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వంశీపై 2025లో చీటింగ్‌ కేసు నమోదు చేశారు. అప్పటినుంచి కేసు నడుస్తుండగానే వంశీకి కాల్స్‌ చేసి కేసు ఉపసంహరించు కోవాలంటే రూ.మూడు కోట్లు ఇవ్వాలి.. ఇవ్వకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేది. విసిగిపోయిన వంశీ ఆమె నెంబర్‌ బ్లాక్‌ చేశాడు. దీంతో గడచిన నెలరోజులుగా ఈ మెయిల్స్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతుంది. తాజాగా  మరోమారు రూ.మూడు కోట్లు ఇచ్చి కేసు సెటిల్‌ చేసుకోకుంటే చంపేస్తానని వంశీకి మెయిల్‌ పంపింది. దీంతో వంశీ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Also Read : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి.. పోలీసుల తీరుపై అనుమానాలు?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.