
Telangana : ఖాకీ చొక్కాకి మచ్చ తెచ్చేలా ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ చేసిన దుర్మార్గపు చర్యలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా మహిళలను నమ్మించి, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐ రాసలీలలు ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ (2014 బ్యాచ్) సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. వివాహితుడైన శ్రీకాంత్ తన హోదాను అడ్డం పెట్టుకుని పలువురు మహిళల జీవితాలతో ఆటలాడినట్లు విచారణలో బయటపడుతోంది.
Also Read : తెలంగాణ పోలీసు శాఖలో భారీ నోటిఫికేషన్: 7,437 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
గతేడాది ఫేస్‌బుక్ ద్వారా వరంగల్‌కు చెందిన ఓ మహిళతో శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని క్రమంగా పెంచుకున్న అతను, ఆమె ఆర్థిక పరిస్థితిని,ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకు చేరువయ్యాడు. తరచూ ఫోన్లు చేస్తూ మాయమాటలు చెప్పిన ఎస్ఐ శ్రీకాంత్, ఒకరోజు వరంగల్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై శారీరకంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా బాధితురాలికి సంబంధించిన నగ్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ తీవ్రంగా బెదిరిస్తూ మానసికంగా కుంగదీశాడు. ఎస్ఐ టార్చర్ భరించలేకపోయిన బాధితురాలు ధైర్యం చేసి హనుమకొండ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హనుమకొండ పోలీసులు నిందితుడు ఎస్ఐ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణ ముమ్మరం చేయగా శ్రీకాంత్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ బాధితురాలే కాకుండా, హైదరాబాద్‌లోనూ మరో యువతిని ఇలాగే ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. రక్షించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి అసాఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎస్ఐ శ్రీకాంత్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : LRS గడువు పెంపు.. మరో నాలుగు నెలలు టైమ్ !









