bride

పచ్చని పందిట్లో పెళ్లయి, నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన నవ వధువు.. వివాహమైన 40 రోజులకే నూరేళ్లూ నిండకుండానే కన్నుమూసింది. విశాఖపట్నం నగరంలోని పీఎంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్ హెచ్ కాలనీలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాండ్రాపు కృష్ణవేణి (25) అనే నవ వధువు తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ జి. బాలకృష్ణ వెల్లడించారు. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన యాండ్రాపు మురళీ అనే బంధువుతో కృష్ణవేణికి ఈ ఏడాది మే 13వ తేదీన ఘనంగా వివాహమైంది. భర్త మురళీ ఒక ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తుండగా, కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఒక షాపులో ఉద్యోగం చేస్తోంది. కొత్తగా పెళ్లయిన ఈ జంట గత 20 రోజులుగా పీఎంపాలెంలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు.

ఎప్పటిలాగే బుధవారం ఉదయం మురళీ తన ఉద్యోగానికి వెళ్లాడు. రాత్రి విధులను ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి, భార్య కృష్ణవేణి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే కోలుకుని ఈ విషయాన్ని స్థానిక పీఎంపాలెం పోలీసులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న వెంటనే ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించారు.

Also Read : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త: అక్టోబర్‌లో ‘మెగా డీఎస్సీ-2026’

తీవ్ర విషాదం

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని సీఐ బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన కొద్దిరోజులకే వధువు బలవన్మరణానికి పాల్పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read : రాధాగాయత్రి కేసులో బిగ్ ట్విస్ట్…శ్రీచరణ్ పై హత్యకేసు నమోదు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.