Punjab : చనిపోయాడని భావించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 15 రోజులకు అతడు బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పంజాబ్‌లోని కపుర్తలాలో ఈ వింత ఘటన జరిగింది. కనిపించకుండా పోయిన రవి కుమార్ అనే యువకుడు చనిపోయాడని భావించిన కుటుంబానికి చివరికి అతడు జైలులో ఉన్నట్లు సమాచారం వచ్చింది.

Also Read : ఫోన్ కాల్ కోసం బైక్ ఆపారు.. స్పీడ్ కారు దూసుకెళ్లడంతో కుటుంబం మృతి

రవి కుమార్ ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఓ యువకుడి కాలిపోయిన మృతదేహం పోలీసులకు లభించింది. ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోలను పోలీసులు కుటుంబసభ్యులకు చూపించారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబసభ్యులు, మరికొందరు ఆ మృతదేహం రవిదేనని గుర్తించారు. దీంతో రవి చనిపోయాడని భావించిన కుటుంబం ఆగస్టు 13న అంత్యక్రియలు నిర్వహించింది.

అయితే సెప్టెంబర్ 2న కుటుంబానికి కపుర్తలా సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చింది. జైలులో రవి కుమార్ పేరుతో ఓ వ్యక్తి ఉన్నాడని సిబ్బంది తెలిపారు. అసలు రవి కుమార్ నెల రోజుల క్రితమే జలంధర్ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి కపుర్తలా జైలుకు తరలించినట్లు తెలిసింది.

ఈ విషయం తెలియగానే కుటుంబసభ్యులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. మరుసటి రోజు జైలుకు వెళ్లి రవిని ప్రత్యక్షంగా చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే తాము అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిది? దాన్ని రవిదిగా ఎలా గుర్తించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం : కారు నుజ్జు నుజ్జు.. 8 మంది స్పాట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.