Kolkata : కోల్‌కతాలో మైనర్ బాలికతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఓ యువకుడిని, అతడి తండ్రిని నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. బెహాలా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. యువకుడి స్నేహితుడిని కూడా కొట్టి, ఇదే విధంగా అవమానించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక తండ్రి, మేనమామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. యువకుడు తన స్నేహితుడితో కలిసి బాలికను కలవడానికి వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా యువకుడు బాలికను ముద్దు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బాలిక మేనమామ స్నేహితుడు గమనించి ఆమె తండ్రి, మేనమామకు చెప్పాడు.

దీంతో బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి యువకుడితో పాటు అతడి స్నేహితుడిని ఖుదీరాంపల్లిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరినీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత యువకుడి తండ్రిని కూడా అక్కడికి పిలిపించి అతడిని కూడా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురినీ నగ్నంగా ఊరేగించాలని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తుపాకీతో చంపేస్తామని బెదిరించి, ఇంటి ముందు ఉన్న వీధిలో సుమారు 50 మీటర్ల దూరం ముగ్గురినీ నగ్నంగా ఊరేగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెహాలా ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.