
Karnataka : కర్ణాటకలోని బెళగావిలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మంటల్లో మాడి ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను భారతి దామోనె (50), శారద దామోనె (45), గంగ దామోనె (25), ప్రియ దామోనె (24) గా గుర్తించారు. వీరంతా సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఇదే కుటుంబానికి చెందిన గజానన్ దామోనె (65), రోషన్ దామోనె (21) తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన వారిలో శారద గజానన్ భార్య కాగా, భారతి దామోనె ఆయన చెల్లెలు. ప్రియ, గంగ ఇద్దరూ గజానన్-శారద దంపతుల కూతుళ్లు కాగా, రోషన్ వారి కొడుకు. గజానన్ వడ్రంగిగా పనిచేస్తుండగా, కుటుంబంలోని మిగతా వారు ఇళ్లల్లో పనులు లేదా వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామోనె కుటుంబం గణేశ చతుర్థి పండుగ జరుపుకోవడానికి సిద్ధమైంది. సెంట్రల్ బస్ స్టాండ్ సమీ Aలోని చవట్ గల్లీలో ఉన్న తమ ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రపోయారు. ఎప్పటిలాగే వారు రిఫ్రిజిరేటర్కు దగ్గరగానే పడుకున్నారు.
సోమవారం రాత్రి సుమారు 2:15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వారు వెంటనే ఆ కుటుంబం ఉంటున్న షెడ్డు వద్దకు పరిగెత్తి చూసేసరికి అక్కడ మంటలు చెలరేగి ఉన్నాయి. స్థానికులు అతి కష్టం మీద గజానన్, రోషన్లను బయటకు లాగగలిగారు. అప్పటికే మిగతా నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. గాయపడిన ఇద్దరికీ దాదాపు 60 శాతం కాలిన గాయాలయ్యాయి. పక్కా సిమెంట్ గోడలు లేని ఆ షెడ్డు పేలుడు దాటికి ధ్వంసమైంది. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
రిఫ్రిజిరేటర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేలినప్పటికీ, అది ఎలా పేలిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అని విచారిస్తున్నారు. గణేశ విగ్రహానికి ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.









