
Anakapalli : అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో, కట్టుకున్న భర్తను ఒక భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించిన ఘోర ఉదంతం అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. దేవరాపల్లి మండలం రైవాడ శివారు శ్రీరాంపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురం గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి అప్పలనాయుడు (38)కు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన హైమతో 2016లో పెళ్లి జరిగింది. వీరికి ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పలనాయుడు వైజాగ్ లో కలాసీగా పనిచేస్తూ రోజు ఇంటికి రాకపోకలు సాగించేవాడు. భార్య హైమ స్థానికంగా వెలుగు సంస్థలో వీఓఏ (VOA)గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కె.కోటపాడు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇంట్లోనే ఉంటూ నిఘా
భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అప్పలనాయుడు ఆమెను పలుమార్లు మందలించాడు. భార్యపై నిఘా ఉంచేందుకు విశాఖలో చేస్తున్న కలాసీ పనిని కూడా వదిలేసి, సొంత ఊరైన శ్రీరాంపురంలోనే ఉంటూ కూలి పనులకు వెళ్లడం ప్రారంభించాడు. భర్త ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ నిఘా పెట్టడంతో ప్రియుడు గంగాధర్‌ను కలవడానికి హైమకు వీలుపడలేదు. దీంతో తమ బంధానికి అడ్డుగా మారిన భర్తను పూర్తిగా వదిలించుకోవాలని హైమ, గంగాధర్ కలిసి ఒక పక్కా స్కెచ్ వేశారు.
పథకంలో భాగంగా బుధవారం రాత్రి అప్పలనాయుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, హైమ అతనికి మత్తు టాబ్లెట్లు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు గంగాధర్‌కు ఆమె సమాచారం అందించింది. గంగాధర్ తనతో పాటు మరికొందరు మనుషులను తీసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె ఇంటికి వచ్చాడు. నిద్రమత్తులో ఉన్న అప్పలనాయుడుపై వారంతా కలిసి దాడి చేసి, గొంతు నులిమి దారుణంగా హతమార్చారు.
గురువారం ఉదయం అప్పలనాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు అన్న ఇంటికి వచ్చి చూడగా, అప్పలనాయుడు విగతజీవిగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన వదిన హైమే ప్రియుడితో కలిసి అన్నను చంపేసిందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘోర ఘటనపై దేవరాపల్లి సీఐ కృష్ణ, ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు హైమ, ఆమె ప్రియుడు గంగాధర్‌తో పాటు ఈ హత్యలో పాలుపంచుకున్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు.









