Andhra Pradesh :  రాష్ట్రాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనులకు నిధుల కొరత రాకుండా ఉండేందుకు, పన్నుల వాటా కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1,09,019 కోట్లను కేంద్రం విడుదల చేసింది. సాధారణంగా ప్రతి నెలా పదో తేదీలోపు ఈ డబ్బులు ఇస్తుంటారు, కానీ ఈసారి గడువు కంటే ముందే ఈ నిధులను విడుదల చేయడం విశేషం. దీనివల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 4,597 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 2,370 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సంక్షేమ కార్యక్రమాలను సజావుగా సాగించడానికి, అభివృద్ధి పనులకు ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం తెలిపింది. కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రాలకు ఇలా ముందుగానే డబ్బులు ఇవ్వడం వల్ల మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయని, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతాయని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీకి రూ. 4,597 కోట్లు చాలా సరైన సమయంలో అందాయని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి ముఖ్యమైన రంగాలను మరింత అభివృద్ధి చేయడానికి ఈ నిధులు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పవన్ కొనియాడారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.