TTD : శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తులను, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న టీటీడీ సస్పెండెడ్ ఉద్యోగి జలకర గిరిధర్‌ను తిరుమల టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని కోలా వీధికి చెందిన జలకర గిరిధర్ గతంలో టీటీడీలో సబార్డినేట్ ఉద్యోగిగా పనిచేసేవాడు. ప్రస్తుతం అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు.

తాను టీటీడీలో పేష్కార్‌నని నమ్మించి.. ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి వద్ద సేవా టికెట్ల పేరుతో ఫోన్‌పే ద్వారా రెండు విడతలుగా రూ.1,56,000 నగదు తీసుకున్నాడు. ఈ ఏడాది మే 24న టికెట్ల కోసం భక్తులు ఎస్‌ఎంసీ ప్రాంతానికి చేరుకోగా, ఆ సమయంలో గిరిధర్ తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : నకిలీ కాల్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ను ఛేదించిన TG CSB

పోలీసు విచారణలో గిరిధర్ మరో మోసాన్ని కూడా బయటపెట్టాడు. తిరుపతికి చెందిన ఓ నిరుద్యోగికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3,60,000 తీసుకొని మోసం చేసినట్లు తేలింది. ఈ రెండు కేసుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.

ఇక మరోవైపు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం జరిగే శ్రీవారి దర్శనం కోసం బుధవారం ఎలాంటి టోకెన్లు జారీ చేయరని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు టోకెన్ల కోసం ఎదురుచూడకుండా నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఇక శుక్రవారం జరిగే దర్శనానికి మాత్రం గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. అయితే టోకెన్ల జారీని నిలిపివేయడంపై భక్తుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా సర్వదర్శనం కల్పించే విధానాన్ని టీటీడీ గత ఏడు బుధవారాలుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.

Also Read : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యనే రూ. 12 లక్షలకు బేరం పెట్టాడు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.