
Crime :దేశరాజధాని ఢిల్లీలో మోసపూరిత సైబర్ కాల్ సెంటర్ నెట్వర్క్ గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో( TG CSB) పోలీసులు రట్టు చేశారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన TG CSB పోలీసులు ఈ సందర్భంగా21 మంది మహిళా టెలికాలర్లు, బ్యాంక్ ఖాతాదారులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన అరెస్టయిన టెలికాలర్లంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు.ఈ ముఠా ఢిల్లీలో మూడు కాల్ సెంటర్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని శివమార్కెట్లో ఉన్న మూడు సైబర్ నేర కాల్ సెంటర్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దాడులు చేశారు. టెలీకాలర్లుగా పనిచేస్తున్న 21 మంది తెలంగాణ యువతులతో పాటు మరో బ్యాంక్ ఖాతాదారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ నిర్వాహకులు లలిత్సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సైబర్ నేరగాళ్ల ముఠా తెలంగాణకు చెందిన యువతులను టెలీకాలర్లుగా నియమించుకొని ఏడాదిన్నరగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. వీరంతా బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరిట ఆకర్షణీయ రుణాల మంజూరు ఆఫర్లతో మోసాలు చేస్తున్నారు. బాధితులకు ఫోన్లు చేసి.. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.. తెలంగాణ వ్యాప్తంగా 22 సైబర్ మోసాల కేసులతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఈ మేరకు గుర్తించారు.. ఈ ఆపరేషన్లో 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న టెలీకాలర్లలో పలువురు జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్నగర్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.









