Vijayawada :దేశమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ విజయవాడలో విషాదం నెలకొంది. స్థానిక కృష్ణనదిలో ఈతకొట్టడానికి నదిలోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కృష్ణలంకకు చెందిన గౌతమ్‌, తేజ, జాషువా అనే యువకులు కృష్ణనదిలో స్నానం చేయడానికి వచ్చారు. సరదాగా ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్య్కూ బృందాలు, గజ ఈతగాళ్ళను రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో చాలాసేపు గాలించిన తర్వాత ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన యువకులు కావడంతో మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.