Andhra Pradesh : గ్రామాల్లో సర్పంచ్‌లుగా పనిచేసిన కొందరు నాయకులు ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎదిగారు. ప్రజల మధ్య ఉంటూ రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు అసెంబ్లీ వరకు చేరుకున్నారు. అలాంటి నాయకులు ఏపీలో పలువురు ఉన్నారు. వారిలో కొందరు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండగా, మరికొందరు 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

గొండు శంకర్ : శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట గ్రామ సర్పంచ్‌గా, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున శ్రీకాకుళం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. – ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు.

అరవ శ్రీధర్ : తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ముక్కావారిపల్లె గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేనలో చేరారు. తొలుత ప్రకటించిన అభ్యర్థిని మార్చి పవన్ కల్యాణ్ అరవ శ్రీధర్‌కు టికెట్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులుపై 11,101 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Also Read : విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ ప్రస్థానం.. కొత్త పార్టీ పేరు ఇదే!

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి : డోన్ నియోజకవర్గానికి చెందిన బుగ్గన బేతంచెర్ల గ్రామంలో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం అసెంబ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించి 2014, 2019 ఎన్నికల్లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

బూడి ముత్యాలనాయుడు: అనకాపల్లి జిల్లాకు చెందిన బూడి ముత్యాలనాయుడు తరువ గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అన్నంరెడ్డి అదీప్ రాజ్: విశాఖపట్నం జిల్లాకు చెందిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ 2006లో రాంపురం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయాల్లో ఎదిగి 2019 ఎన్నికల్లో పెందుర్తి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు చేతిలో ఓటమి చవిచూశారు.

ఈర్ల లక్కప్ప: మడకశిర నియోజకవర్గానికి చెందిన ఈర్ల లక్కప్ప గతంలో గుడిబండ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2024 ఎన్నికల్లో మడకశిర నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు చేతిలో కేవలం 351 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

Also Read : ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల రూల్స్.. నామినేషన్ నుంచి రిజర్వేషన్ల వరకు తెలుసుకోవాల్సిన విషయాలివే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.