
AP EAPCET Results : ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET) 2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం మధ్యాహ్నం సాషల్ మీడియా వేదికగా (X ద్వారా) ఈ ఫలితాలను విడుదల చేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి అధికారులతో కలిసి జేఎన్‌టీయూ వీసీ ప్రసాద్ విద్యార్థుల ర్యాంకులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫలితాల విడుదలతో రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది ఫలితాల సరళిని పరిశీలిస్తే, ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది విద్యార్థులు అర్హత సాధించి, 70.52 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఈ విభాగంలో విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ 71.65 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ స్ట్రీమ్‌లో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది పరీక్ష రాయగా, ఏకంగా 63,546 మంది (89.59 శాతం) అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
ఫలితాల ప్రకటనతో పాటు రెండు విభాగాలకు సంబంధించిన టాప్-10 ర్యాంకర్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు:
ఇంజినీరింగ్ స్ట్రీమ్ టాపర్లు: జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (గుంటూరు జిల్లా) మొదటి స్థానంలో నిలవగా.. కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం), వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి (పల్నాడు), తుంగ దుర్గా సుప్రభాత్ (పల్నాడు), తెల్లూరి శ్రేయస్ రెడ్డి (హైరాబాద్), ముక్కార సాకేత్ (వైఎస్‌ఆర్ కడప), బండి వెంకట సాత్విక్ (గుంటూరు), నూర్ బాషా హఫీజ్ (గుంటూరు), పసల మోహిత్ (కడప), మరక వంశీధర్ రెడ్డి (వైఎస్‌ఆర్ కడప) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
అగ్రికల్చర్ & ఫార్మా స్ట్రీమ్ టాపర్లు: శంబంగి జశ్వంత్ నాయుడు (విజయనగరం) టాప్ ర్యాంక్ సాధించగా.. కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి (మేడ్చల్ మల్కాజ్‌గిరి), కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా), కర్రి సత్యనారాయణ (కాకినాడ), బంటు ధాత్రిక (అనకాపల్లి), పల్లికొండ దర్శ్‌తేజ (కాకినాడ), వల్లెపు ధీరజ్ కృష్ణ (గుంటూరు), దండమూడి జాగృతి (గుంటూరు), ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి (పల్నాడు), రేలంగి జయ షణ్ముఖి (విజయనగరం)లు టాప్-10లో నిలిచారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సరికొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో సందేశం (Message) పంపి తమ ఫలితాలను తక్షణమే తెలుసుకోవచ్చు. ఫలితాలు వెలువడటంతో వేలాది మంది విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు.









